Share News

20ల్లో ఉండగానే జాబ్‌కు యువకుడి రాజీనామా! ఏఐ వచ్చేసిందంటూ వార్నింగ్

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:22 PM

ఏఐ వచ్చేసిందన్న ఓ టెకీ తాజాగా తన జాబ్‌కు రాజీనామా చేశాడు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున లేఆఫ్స్ ఉంటాయని హెచ్చరించారు. రెడిట్‌లో అతడు పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

20ల్లో ఉండగానే జాబ్‌కు యువకుడి రాజీనామా! ఏఐ వచ్చేసిందంటూ వార్నింగ్
software engineer quits job Due to AI

ఇంటర్నెట్ డెస్క్: ముప్ఫై ఏళ్లు కూడా రాని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాజాగా తన జాబ్‌కు రాజీనామా చేశాడు. ఏఐ వచ్చేసిందని, పనంతా అదే చేసేస్తోందని రెడిట్‌లో పోస్టు పెట్టాడు. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల అవసరం ఉండదని చెప్పుకొచ్చారు. అందుకే తాను తన స్వస్థలానికి వెళ్లిపోతున్నట్టు ఆ రాజస్థాన్ యువకుడు చెప్పుకొచ్చాడు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది (Techie Quits Job Due to Rise of AI)

‘ప్రస్తుతం ఏఐ ఎంతో మెరుగ్గా పనిచేస్తోంది. అందుకే, సాఫ్ట్‌‌వేర్ జాబ్ మానేస్తున్నా. మా సంస్థలో ప్రస్తుతం 70 శాతం కోడింగ్ క్లాడ్ అనే ఏఐ రాసిస్తోంది. రెండేళ్ల క్రితం దీనితో పని చేయించుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడలా లేదు. అద్భుతంగా పనిచేస్తోంది. ఇక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అవసరం లేని రోజులు దగ్గరపడుతున్నాయి’ అని అతడు రాసుకొచ్చాడు.

జాబ్స్ తగ్గిపోయేకొద్దీ మార్కెట్‌లో ఉద్యోగార్థుల మధ్య పోటీ విపరీతంగా పెరుగుతుందని అన్నారు. ఇప్పటికే భారత్‌లో ఏటా వేల మంది చదువులు పూర్తి చేసుకుని జాబ్ మార్కెట్‌లోకి వస్తున్నారని చెప్పారు.


‘సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ అంటే కేవలం కోడింగ్ మాత్రమే కాదని నాకు తెలుసు. కానీ కొన్నేళ్ళ క్రితం చిన్న ఫీచర్‌ను జోడించేందుకు మేము తెగ పరుగులు పెట్టేవాళ్లం. కానీ ఏఐతో ఈ పని ప్రస్తుతం ఒక్క రోజులో పూర్తయిపోతోంది. ఫలితంగా భవిష్యత్తులో భారీ స్థాయిలో లేఆఫ్స్ మొదలవుతాయి’ అని చెప్పుకొచ్చాడు.

తాను సాఫ్ట్‌‌వేర్ రంగం నుంచే వైదొలగుతున్నట్టు సదరు టెకీ చెప్పుకొచ్చాడు. రాజస్థాన్‌లోని తన స్వస్థలంలో ఓ ఫ్రెండ్‌తో కలిసి ఫొటో స్టూడియో నిర్వహించుకుంటానని చెప్పుకొచ్చాడు. అదృష్టంకొద్దీ నాకు బెంగళూరులో సొంత ఫ్లాట్ లేదు కాబట్టి అదనపు చిక్కులు ఏమీ లేవు’ అని అన్నారు. ఇక అతడి అభిప్రాయంతో నెట్టింట అనేక మంది ఏకీభవించారు.


ఇవీ చదవండి:

మాకూ హెల్ప్ చేయండి! సుందర్ పిచాయ్‌కు భారతీయ విద్యార్థుల రిక్వెస్ట్

నా బిడ్డను వెలేశారు.. ఓ తండ్రి పోస్టు నెట్టింట వైరల్

Updated Date - Jan 23 , 2026 | 02:29 PM