నాగుపాముతో ఆటలాడాడు.. నిమిషాల్లో ప్రాణం పోయింది..
ABN , Publish Date - May 02 , 2026 | 10:00 AM
నాగుపామును పట్టుకున్న ఓ స్నేక్ క్యాచర్ జనం ముందు ఫోజులు కొట్టడానికి దానితో ఆటలాడాడు. అది రెండు సార్లు కాటు వేసినా ఆస్పత్రికి వెళ్లలేదు. దీంతో నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పాములు పట్టేవాడు పాము కాటుకే బలయ్యాడు. నాగుపామును పట్టుకున్న ఓ స్నేక్ క్యాచర్ జనం ముందు ఫోజులు కొట్టడానికి దానితో ఆటలాడాడు. అది రెండు సార్లు కాటు వేసినా ఆస్పత్రికి వెళ్లలేదు. దీంతో నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది.. ఆ వ్యక్తి ఎవరు అన్న విషయాలు తెలియరాలేదు. సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే..
స్నేక్ క్యాచర్ గోడౌన్‌నుంచి నాగుపామును పట్టుకుని రోడ్డు దగ్గరకు తీసుకువచ్చాడు. అక్కడ పోలీసులు, సాధారణ జనం పెద్ద సంఖ్యలో నిల్చుని ఉన్నారు. స్నేక్ క్యాచర్ పామును నేలపై వదిలేశాడు. అది అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. అతడు దాన్ని వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నాగుపాము అతడి ఎడమకాలిపై కాటు వేసింది. పాము కాటు వేసినా అతడు పట్టించుకోలేదు. పాము తోక పట్టుకుని ఆటలు ఆడ్డం మొదలెట్టాడు. జనం ఎంతో ఆసక్తిగా అతడు చేసే పనిని చూస్తున్నారు. స్నేక్ క్యాచర్ మరింత రెచ్చిపోయాడు.
ఈ నేపథ్యంలోనే పాము అతడి కుడి చేతి వేలిపై కాటు వేసింది. అతడు పామును నేలపై పడేసి దాని తోకను కాలితో తొక్కిపట్టాడు. పాము కరిచిన వేలి నుంచి నోటితో రక్తం పీల్చి బయటకు ఊశాడు. చేతి మణికట్టు దగ్గర జేబురుమాలును కట్టించుకున్నాడు. తర్వాత మళ్లీ పాముతో ఆటలు ఆడ్డం మొదలెట్టాడు. పాము కరిచి చాలా సేపు అవ్వటంతో విషం ప్రభావం మొదలైంది. అతడు నేలపై కుప్పకూలిపోయాడు.
ఇవి కూడా చదవండి
పశ్చిమాసియా, ఐరోపా ముక్కలు కాకుండా కాపాడాం: అమెరికా అధ్యక్షుడు
వారి మరణాలకు కారణం పుచ్చకాయ కాదు.. వెలుగులోకి సంచలన విషయాలు..