వారి మరణాలకు కారణం పుచ్చకాయ కాదు.. వెలుగులోకి సంచలన విషయాలు..
ABN , Publish Date - May 02 , 2026 | 09:06 AM
ముంబైకి చెందిన అబ్దుల్లా దొకాడియా కుటుంబం చనిపోవడానికి పచ్చకాయకు సంబంధం లేదని తేలింది. విషం కారణంగా వారు చనిపోయినట్లు ఫోరెన్సిక్ టెస్టుల్లో బయటపడింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ముంబైకి చెందిన అబ్దుల్లా దొకాడియా కుటుంబం చనిపోవడానికి పచ్చకాయకు సంబంధం లేదని తేలింది. విషం కారణంగా వారు చనిపోయినట్లు ఫోరెన్సిక్ టెస్టుల్లో బయటపడింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మృతుల బ్రెయిన్, గుండె, పేగులు ఆకుపచ్చగా మారిపోయాయి. లక్షణాలు, అంతర్గత ఫలితాలను ఆధారంగా చేసుకుని ఇది ఫుడ్ పాయిజన్ అవ్వడానికి ఆస్కారం లేదని ఫోరెన్సిక్ వైద్యులు భావిస్తున్నారు. అబ్దుల్లా దొకాడియా శరీరంలో.. శక్తివంతమైన పెయిన్ కిల్లర్ 'మార్ఫిన్' ఉన్నట్లు తేలింది. మార్ఫిన్ ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ కాదు. దీన్ని కొనాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి.
మార్ఫిన్ విషయంలో ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులను అనేక సందేహాలు, అనుమానాలు వెంటాడుతున్నాయి. అబ్దుల్లా ట్రీట్‌మెంట్‌లో భాగంగా మార్ఫిన్ తీసుకుంటున్నాడా లేదా పొరపాటున ఆ డ్రగ్ తీసుకున్నాడా లేదా ఎవరైనా ఆ డ్రగ్ అతడికి ఇచ్చారా? అన్న కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మరణాలకు పుచ్చకాయకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని ‘ది స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ అధికారులు స్పష్టం చేశారు. వారి మరణానికి కారణం ఏంటో శాస్త్రీయంగా నిర్ధారణ అయిన తర్వాతే తుది నిర్ణయానికి రావడం జరుగుతుందని తెలిపారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ముంబైలోని పైధోనీ ఏరియాకు చెందిన 40 ఏళ్ల అబ్దుల్లా దొకాడియా, అతడి భార్య నస్‌రీన్, కూతుళ్లు 16 ఏళ్ల అయేషా, 13 ఏళ్ల జైనాబ్‌లు 25వ తేదీ రాత్రి బిర్యానీ తిన్నారు. బిర్యానీ తిన్న గంట తర్వాత పుచ్చకాయ తిని పడుకున్నారు. కొంతసేపటికే నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తల నొప్పి, కడుపునొప్పి మొదలయ్యాయి. మరుసటి రోజు ఉదయానికి అయేషా, జైనాబ్ చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అబ్దుల్లా, నస్‌రీన్ చనిపోయారు.
ఇవి కూడా చదవండి
ఆ యువకులకు ఈ విజయం అంకితం: అక్షర్ పటేల్
హోర్ముజ్ జలసంధిపై కొత్త నిబంధనలు.. ఐఆర్‌జీసీ కీలక ప్రకటన..