ఎయిర్‌ఇండియా టాయిలెట్‌లో మా ఆయన పట్టట్లేదు: ప్రయాణికురాలి సరదా కామెంట్
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:19 PM
ఆరడుగుల ఎనిమిది అంగుళాల పొడవున్న తన భర్త ఎయిర్‌ఇండియా విమానం టాయిలెట్‌లో పట్టట్లేదంటూ ఓ కెనడా మహిళ నెట్టింట షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆరడుగుల ఎనిమిది అంగుళాల పొడవున్న తన భర్త ఎయిర్‌ఇండియా విమానం టాయిలెట్‌లో పట్టట్లేదంటూ ఓ కెనడా మహిళ నెట్టింట షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ట్రావెల్ కంటెంట్ క్రియేటర్లు రేమండ్, రామిసా ఇన్‌స్టాలో ఈ వీడియోను షేర్ చేశారు. బాగా పొడవున్న కారణంగా తన భర్తకు బాత్రూమ్‌కు వెళ్లడం కూడా ఎంతో కష్టమని ఆమె చెప్పారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తక్కువ వెడల్పు ఉన్న విమానం టాయిలెట్‌లోకి వెళ్లలేక రేమండ్ నానా యాతనా పడ్డాడు. ఎలాగొలా లోపల కూర్చున్నప్పటికీ మోకాళ్లు బయటకు వచ్చాయి. తలుపులు మూసుకోవడం కష్టంగా మారింది. ఇదంతా రామిసా వీడియోలో రికార్డు చేశారు. ఇది బాత్రూమ్ బ్రేక్ కాదు, కసరత్తులాగా ఉంది అని వ్యాఖ్యానించారు. ఎయిర్ ఇండియా వర్సెస్ 6'8" అడుగుల వ్యక్తి అంటూ వీడియోపై క్యాప్షన్ కూడా జత చేశారు.
ఈ వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున్న స్పందన వచ్చింది. అనేక మంది ఎంజాయ్ చేశారు. కొందరు మాత్రం చిన్నపాటి చర్చ లేవదీశారు. విమానాన్ని తయారు చేసింది బోయింగ్ సంస్థ అయితే క్యాప్షన్‌లో ఎయిర్ఇండియా ప్రస్తావన ఎందుకని ప్రశ్నించారు. బోయింగ్, ఎయిర్‌బస్ తయారు చేసే మోడల్స్ ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉంటాయని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ అవుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
దిండు ధర రూ.40 వేలు.. భారతీయ మహిళ వీడియో వైరల్
హైవేపై చెల్లాచెదురుగా పెళ్లి శుభలేఖలు.. అపరిచితుల సాయం చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు