ఢిల్లీ మెట్రోలో తాతయ్య గొంతు విని ఆశ్చర్యపోయిన మనవడు.. షమ్మీ నారంగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:01 PM
ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారికి ఊహించని అనుభవం ఎదురైంది. తన తొలి మెట్రో ప్రయాణంలో రైలు స్పీకర్ల నుంచి తాతయ్య గొంతు వినిపించడంతో బాలుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. తాత పక్కనే ఉన్నా వాయిస్ ఎక్కడి నుంచో రావడంతో ఒకింత అయోమయానికి లోనయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారికి ఊహించని అనుభవం ఎదురైంది. తన తొలి మెట్రో ప్రయాణంలో రైలు స్పీకర్ల నుంచి తాతయ్య గొంతు వినిపించడంతో బాలుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. తాత పక్కనే ఉన్నా వాయిస్ ఎక్కడి నుంచో రావడంతో ఒకింత అయోమయానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ షమ్మీ నారంగ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఢిల్లీ, ముంబై మెట్రోలతో పాటు పలు మెట్రో నెట్‌వర్క్‌లలో ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్, మెట్రో అనౌన్సర్ షమ్మీ నారంగ్ తన గళాన్ని అందించారు. ఇటీవల తన మనవడు రుషాన్‌ను తొలిసారి ఢిల్లీ మెట్రో ప్రయాణానికి ఆయన తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మెట్రో స్పీకర్ల నుంచి తనకు ఎంతో పరిచయమైన తాతయ్య గొంతు వినిపించడంతో రుషాన్ ఆశ్చర్యపోయాడు. తాతయ్య పక్కనే ఉన్నప్పటికీ అదే గొంతు స్పీకర్ల నుంచి వినిపించడం అతడికి కొత్త అనుభూతిని కలిగించింది. దీనికి సంబంధించిన వీడియోను షమ్మీ నారంగ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అందులో ఛత్తర్‌పూర్ స్టేషన్‌కు సంబంధించిన ప్రకటన వినిపిస్తుంది. ప్రకటన చివరిలో నారంగ్ తనదైన శైలిలో మెట్రో అనౌన్స్‌మెంట్‌ను అనుకరిస్తూ ‘అగ్లా స్టేషన్ సుల్తాన్‌పూర్ హై’ అంటూ సరదాగా చెప్పడం కనిపించింది.
ఈ సందర్భంగా షమ్మీ నారంగ్ భావోద్వేగానికి గురయ్యారు. తాను ఎప్పటికీ ఈ మెట్రో రైళ్లలో ప్రయాణించకపోయినా.. తన గొంతు మాత్రం ఒక తరం నుంచి మరో తరానికి ప్రయాణిస్తుందనే ఆలోచన ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. తన మనవడు రుషాన్ నుంచి భవిష్యత్తులో అతడి పిల్లల వరకు తన గొంతు ఒక జ్ఞాపకంగా మిగిలిపోవచ్చని చెప్పుకొచ్చారు. కాగా, షమ్మీ నారంగ్ గొంతు మెట్రో ప్రయాణికులకు ఎంతో సుపరిచితం. ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఆయన గొంతును ‘ఐకానిక్ వాయిస్’గా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..