Share News

చలిలో వణుకుతున్న కుక్కకు దుప్పటి కప్పాడని జాబ్‌లోంచి తీసేశారు!

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:42 PM

మేనేజర్ ఆదేశాలకు విరుద్ధంగా వీధి కుక్కపై జాలి చూపించినందుకు తన జాబ్ పోయిందంటూ రష్యా వ్యక్తి చేసిన ఆరోపణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

చలిలో వణుకుతున్న కుక్కకు దుప్పటి కప్పాడని జాబ్‌లోంచి తీసేశారు!
Russia Dodo Pizza controversy

ఇంటర్నెట్ డెస్క్: చలిలో వణుకుతున్న కుక్కకు దుప్పటి కప్పినందుకు తనను జాబ్‌లోంచి తీసేశారంటూ ఓ పిజ్జా డెలివరీ ఏజెంట్ చేసిన ఆరోపణ ప్రస్తుతం నెట్టింట పెను కలకలం రేపుతోంది. రష్యాలోని ప్రముఖ పిజ్జా చెయిన్ సంస్థ డోడో పిజ్జా ఈ దారుణానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ ఉదంతంపై రష్యా వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి(Russia Dodo Pizza Shop controversy).

చెల్యాబిన్‌స్క్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి డోడో పిజ్జా షాపు వద్ద దాదాపు రెండేళ్లుగా ఓ కుక్క ఉంటోంది. షాపులోని ఉద్యోగులే దానికి ఆహారం పెట్టేవారు. దాని బాగోగులు చూసుకునేవారు. రెస్టారెంట్ మూసేసిన సమయంలో శునకం ఆ రెస్టారెంట్ వసారాలోనే నిద్రించేది. ఇటీవల ఆ పిజ్జా షాపునకు కొత్త మేనేజర్‌గా యూయిల్ అనే మహిళ నియమితులయ్యాక పరిస్థితి మారిపోయిందని బాధితుడు మిఖాయిల్ సావిట్‌స్కీ తెలిపారు.

తన ఉద్యోగం పోవడానికి ఆమే కారణమని బాధితుడు ఆరోపించారు. కుక్కకు తాము ఆహారం పెట్టడం, అది చలిలో వణుకుతున్నప్పుడు దుప్పటి కప్పడం వంటివి చూసిన మేనేజర్ తమకు వార్నింగ్ ఇచ్చిందని మిఖాయిల్ పేర్కొన్నారు. కుక్కకు సాయం చేసే వారు చివరకు దానితో పాటు వీధిపాలవ్వాల్సి వస్తుందని హెచ్చరించినట్టు తెలిపారు.


ఈ క్రమంలో ఇటీవల ఒక రోజు చలిలో వణుకుతున్న కుక్కను చూసి తట్టుకోలేక దానికి దుప్పటి కప్పానని మిఖాయిల్ తెలిపారు. ఆ తరువాత తను యాథావిధిగా పిజ్జాను కస్టమర్‌‌కు డెలివరీ చేసి వచ్చాక తనను జాబ్‌లోంచి తొలగించారని చెప్పాడు. తన ఆదేశాలను ధిక్కరించి కుక్కకు సాయం చేశానన్న కోపంతోనే మేనేజర్ తనను తొలగించిందని ఆరోపించారు. ఇందుకు ఆధారంగా మేనేజర్ గతంలో చేసిన హెచ్చరికల తాలూకు మేసేజీలను కూడా పంచుకున్నారు. ఈ ఉదంతంపై పిజ్జా సంస్థ కూడా స్పందించింది. ఉద్యోగి పనితీరు సరిగా లేనందునే అతడిని తొలగించినట్టు పేర్కొంది. వీధి శునకం అంశానికి ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.


ఈ వార్తలూ చదవండి:

స్పృహ తప్పి పడిపోయిన వధువు! పెళ్లి రద్దు చేసుకున్న వరుడి ఫ్యామిలీ

కాపీ కొడుతూ దొరికిపోయి.. ఇన్విజిలేటర్‌పై పిడిగుద్దులు

Updated Date - Feb 24 , 2026 | 01:50 PM