వెంటాడిన మృత్యువు.. 14 ఏళ్లల్లో ఒకే కుటుంబంలోని నలుగురి దుర్మరణం
ABN , Publish Date - Jul 14 , 2026 | 07:07 PM
నేపాల్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఏనుగు రూపంలో మృత్యువు ఓ కుటుంబాన్ని వెంటాడింది. 14 ఏళ్ల వ్యవధిలో నలుగురు కుటుంబసభ్యులను బలితీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఏనుగు రూపంలో మృత్యువు ఓ కుటుంబాన్ని వెంటాడింది. 14 ఏళ్ల వ్యవధిలో ఆ కుటుంబంలోని నలుగురిని బలితీసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, 2012 డిసెంబర్‌లో దుర్బే అనే ఒక అడవి ఏనుగు చిత్వాన్ నేషనల్ పార్కు సమీపంలో ఉంటున్న శనిచారా బోతే అనే వ్యక్తి తల్లిదండ్రులను తొక్కి చంపేసింది. దీంతో, శనిచారా బోతే తన కుటుంబాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాప్తీ నదిని దాటి జగత్‌పూర్ అనే ప్రాంతంలో సెటిలయ్యాడు. ఏనుగు పీడ విరగడైపోయిందని అనుకున్నాడు. మనశ్శాంతితో జీవించొచ్చని సంబరపడ్డాడు.
కానీ ఇటీవల మరోసారి అతడిని దుర్బే ఏనుగు రూపంలో దురదృష్టం కాటేసింది. అతడు ఉండే ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన దుర్బే ఏనుగు బోతే కోడలు అషికా, మనవడు భరత్ బోతేపై దాడి చేసి చంపేసింది. ‘నది దాటి వెళ్లిపోతే ఏనుగు పీడ విరగడైపోతుందని అనుకున్నాం. కానీ మళ్లీ అదే ఏనుగు నా కోడలు, మనవడిని బలితీసుకుంటుందని అస్సలు అనుకోలేదు’ అని బోతే కన్నీరుమున్నీరయ్యాడు.
నేపాల్‌లో దుర్బే ఏనుగు ఇప్పటివరకూ 25 మందిని బలితీసుకుంది. ఈ పేరు చెబితే చిత్వాన్ జాతీయవనానికి సమీపంలోని వారు వణికిపోతారు. ఈ ఏనుగు పేరిట ఒక ప్రత్యేక వికిపీడియా పేజీ కూడా ఉంది. ఈ ఏనుగు నుంచి జనాల్ని కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. 2016లో తొలిసారిగా ఆ ఏనుగు కదలికలను గమనించేందుకు వీలుగా ట్రాకర్‌ను దాని మెడకు తొడిగారు. అది చెడిపోతే 2020లొ మరో ట్రాకర్‌ను తొడిగారు. 2023లో కూడా పాతదాని స్థానంలో కొత్త ట్రాకర్ కాలర్‌ను బిగించారు. ఈ మధ్యకాలంలో ట్రాకర్‌లో మళ్లీ లోపాలు తలెత్తడంతో ఏనుగు జాడ కానరాక ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
పిల్లలను వాహనాలపై ఒంటరిగా వదిలేస్తున్నారా? షాకింగ్ వైరల్ వీడియో
పెళ్లి కోసం యువకుడి తిప్పలు.. అమ్మాయి కావాలంటూ ఏకంగా రోడ్డుపై..