ప్రకృతి సృష్టించిన అద్భుతం.. అంటార్కిటికా హిమానీనదం నుంచి రక్తం.. షాకింగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Feb 09 , 2026 | 09:25 AM
ఈ ప్రకృతి ఎన్నో అద్భుతాల సమాహారం. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం బయటపడి మనల్ని అబ్బురపరుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో, ఒక హిమానీనదం నుంచి రక్తంలా కనిపించే ఎర్రటి నీరు ఉబికి వస్తోంది.
ఈ ప్రకృతి ఎన్నో అద్భుతాల సమాహారం. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం బయటపడి మనల్ని అబ్బురపరుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో, ఒక హిమానీనదం నుంచి రక్తంలా కనిపించే ఎర్రటి నీరు ఉబికి వస్తోంది. తెల్లటి మంచుపై ఎర్రటి నీటి ప్రవాహం చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఇది నిజంగా రక్తమా? లేక ఏదైనా ప్రకృతి అద్భుతమా? నిజం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే.. ఇది రక్తం కాదు.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రకృతి విచిత్రం (River of blood glacier).
అంటార్కిటికాలోని టేలర్ గ్లేసియర్ నుంచి బయటకు ప్రవహించే ఈ నీరు రక్తంలా కనిపిస్తూ భయపెడుతోంది. ఆ నీరు ఎర్రగా కనిపించడం వెనుక ఓ ఆసక్తికర కారణం ఉంది. ఆ హిమానీనదానికి దిగువన కొన్ని లక్షల ఏళ్లుగా ఓ ఉప్పు నీటి సరస్సు ఉంది. ఆ ఉప్పు నీటిలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. హిమానీనదానికి దిగువన ఉన్న ఆ సరస్సుకు సూర్యకాంతి, ఆక్సిజన్ అందవు. అయితే హిమానీనదం నీటి ఒత్తిడి, లోపల ఉన్న మంచు పగుళ్లు తెరుచుకోవడం, భూమి లోపల ఉష్ణోగ్రతలో మార్పుల కారణంగా ఆ సరస్సులోని నీరు ఒక్కసారిగా బయటకు వస్తుంటుంది (Blood falls antarctica).
ఈ నీరు బయటకు వచ్చి వాతావరణంలోని ఆక్సిజన్‌ను తాకగానే ఇనుము ఆక్సీకరణకు గురవుతుంది (viral glacier video). దీంతో ఇనుము శాతం ఎక్కువగా ఉన్న ఆ నీరు తుప్పు రంగులో రక్తంలా మారుతుంది. తెల్లటి హిమానీనదంపై రక్తప్రవాహం జరుగుతున్నట్టు కనిపిస్తుంది.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఎక్కువ శాతం ఉప్పు ఉన్న నీరు అంత త్వరగా గడ్డకట్టదు. సాధారణ నీరు సున్నా డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గడ్డకడుతుంది. ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీరు మైనస్ 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు గడ్డకట్టదు. హిమానీనదం లోతుల్లో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఒకవేళ ఆ నీరు బయటకు వచ్చినప్పటికీ ఉప్పు శాతం ఎక్కువగా ఉండడం వల్ల మైనస్ డిగ్రీలలోనూ ద్రవంగానే ప్రవహిస్తుంది.
ఇవి కూడా చదవండి..
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. భారత్ నిధులందిస్తోందంటూ పాక్ మంత్రి ఆరోపణలు..
బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..