పెళ్లి కుమారుడి గొప్ప మనసు.. అచ్చం సినిమాను తలపించేలా..
ABN , Publish Date - May 17 , 2026 | 03:21 PM
ఉత్తర్‌ప్రదేశ్‌లో సినిమాను తలపించేలా ఓ సంఘటన చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం కారణంగా గాయాలపాలై ఆస్పత్రిలో ఉన్న వధువు మెడలో వరుడు తాళి కట్టాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లో సినిమాను తలపించేలా ఓ సంఘటన చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం కారణంగా గాయాలపాలై ఆస్పత్రిలో ఉన్న వధువు మెడలో వరుడు తాళి కట్టాడు. ఈ సంఘటన ఘటమ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల శ్వేతకు అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. గత గురువారం శ్వేత పెళ్లి జరగాల్సి ఉంది.
బుధవారం హల్దీ వేడుక సందర్భంగా శ్వేత ఇంట్లో ఓ చోట భోజనాలు తయారు చేస్తుండగా గ్యాస్ లీక్ అయింది. ఆ ప్రాంతం మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో పెళ్లి మండపంలో అలజడి చోటుచేసుకుంది. పెళ్లికి వచ్చిన జనం అటు, ఇటు పరిగెత్తడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే వేడి వేడి నూనె ఉన్న కడాయ్‌ని ఓ వ్యక్తి తగిలాడు. నూనె ఎగిరి పక్కన ఉన్న జనంపై పడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు.
మొత్తం 12 మందికి గాయాలవ్వగా వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పెళ్లి కూతురు శ్వేత, ఆమె తండ్రి జగ్‌దీశ్, నాన్నమ్మ ఉషా, సోదరుడు హంస్‌రాజ్ కూడా ఉన్నారు. వీరందరూ ఆస్పత్రిలో చేరారు. ప్రమాదం కారణంగా పెళ్లి ఆగిపోకూడదని, డాక్టర్లు, ఇరు కుటుంబాల పెద్దలు భావించారు. ఆస్పత్రిలోనే పెళ్లి జరిపించారు. అనుకున్న ముహుర్తానికి శ్వేత పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న కొంతమంది నెటిజన్లు.. ‘పెళ్లి కొడుకు వివాహ్ 2 సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో వివాదంలో కాశ్ పటేల్.. ప్రేయసితో డేట్ కోసం ఎంత ఖర్చంటే..
యూపీలో బుల్డోజర్ యాక్షన్... 240 లాయర్ ఛాంబర్ల కూల్చివేత షురూ