Share News

గుడిలో ప్రీ వెడ్డింగ్ షూట్.. పొట్టుపొట్టు కొట్టిన జనం..

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:43 PM

గుడి పరిసరాల్లో షూ వేసుకుని ఫొటోలు, వీడియోలు తీస్తున్నారంటూ జనం ఫొటోగ్రాఫర్లపై దాడి చేశారు. విచక్షణా రహితంగా చావ కొట్టారు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

గుడిలో ప్రీ వెడ్డింగ్ షూట్.. పొట్టుపొట్టు కొట్టిన జనం..
Bettada Bhairaveshwara Temple

బెంగళూరు, మార్చి 28: గుడిలో ప్రీ వెడ్డింగ్ షూట్ సందర్భంగా దారుణం చోటుచేసుకుంది. గుడి పరిసరాల్లో షూ వేసుకుని ఫొటోలు, వీడియోలు తీస్తున్నారంటూ జనం ఫొటోగ్రాఫర్లపై దాడి చేశారు. విచక్షణా రహితంగా చావ కొట్టారు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హాసన్ జిల్లాలోని సక్లేష్‌పూర్ తాలూకాలో బెట్టాడ బైరవేశ్వర దేవాలయం ఉంది. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం తాజాగా ఓ బ్యాచ్ ఆ గుడి దగ్గరకు వచ్చింది. గుడి ప్రాంగణంలో ఫొటోగ్రాఫర్లు జంటకు ఫొటోలు, వీడియో తీస్తున్నారు.


అయితే, వారు షూ వేసుకుని గుడి ప్రాంగణంలో తిరగటం స్థానికులు చూశారు. ఫొటోగ్రాఫర్లతో గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. ఈ నేపథ్యంలో దాదాపు 10 మంది దాకా స్థానికులు ఫొటోగ్రాఫర్లపై దాడి చేశారు. ఓ కెమెరాను పగులగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గుడి దగ్గరకు చేరుకున్నారు. స్థానికులకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇక, స్థానికుల దాడిలో ఫొటోగ్రాఫర్లు గాయపడ్డారు. గాయపడ్డ వారిని పోలీసులు సక్లేష్‌పూర్‌ తాలూకా ఆస్పత్రిలో చేర్పించారు.


ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముదిగెరె తాలూకా చెందిన అసి, ప్రశాంత్, రక్ష, అరవింద్, ఉచిత్, ప్రజ్వల్, నిశాంత్‌లను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ ఫొటోగ్రాఫర్లను నవి, నందన్‌లుగా గుర్తించారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది గుడి ప్రాంగణంలో షూ వేసుకుని తిరిగిన ఫొటో‌గ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఈ దాడిని ఖండిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మోదీ-ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్.. కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటంటే..

అమరావతికి చట్టబద్ధత తీర్మానాన్ని కేంద్రానికి పంపిన ఏపీ సర్కార్

Updated Date - Mar 28 , 2026 | 05:56 PM