Share News

డీజే విషయంలో గొడవ.. పొట్టుపొట్టు కొట్టుకున్న పెళ్లి వాళ్లు..

ABN , Publish Date - Mar 01 , 2026 | 09:29 AM

డీజే కారణంగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబాల మధ్య గొడవ చోటుచేసుకుంది. రెండు వర్గాలు విచక్షణా రహితంగా దాడి చేసుకున్నాయి. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

డీజే విషయంలో గొడవ.. పొట్టుపొట్టు కొట్టుకున్న పెళ్లి వాళ్లు..
Pratapgarh wedding violence

ఇంటర్‌నెట్ డెస్క్: పెళ్లిలో డీజే కారణంగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబాల మధ్య గొడవ చోటుచేసుకుంది. రెండు వర్గాలు విచక్షణా రహితంగా దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ప్రతాప్‌ఘర్ జిల్లాలోని మోహన్‌గంజ్ బజార్‌కు చెందిన ఓ యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లికుదిరింది. శనివారం పెళ్లి జరగాల్సి ఉంది. శుక్రవారం రాత్రి పెళ్లి కొడుకు తరఫు వారు డీజేతో పెళ్లి కూతురు ఇంటికి వచ్చారు. పెళ్లి కూతురి ఇంటికి వచ్చినా డీజే ఆగలేదు.


రాత్రి 10.30 గంటల సమయంలో ‘ద్వార్‌పూజ’ చేయడానికి పెళ్లి కూతురు తరఫు వారు డీజేను ఆఫ్ చేయించారు. పెళ్లి కుమారుడి తరఫు వారు దీన్ని తట్టుకోలేకపోయారు. పెళ్లి కూతురు తరఫు వారితో గొడవ పెట్టుకున్నారు. గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గొడవ కారణంగా పెళ్లికి వచ్చిన వారు భయభ్రాంతులకు గురయ్యారు. చాలా మంది అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. గొడవను ఆపారు.


గాయపడ్డ నలుగురిని 35 ఏళ్ల లల్లు గుప్త, 50 ఏళ్ల రాంజీ మొదన్‌వాల్, 42 ఏళ్ల కౌశల్ కుమార్, 35 ఏళ్ల శుభం గుప్తగా గుర్తించారు. వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, గొడవ కారణంగా పెళ్లి జరిగిందా? లేదా అన్నది తెలియరాలేదు.


ఇవి కూడా చదవండి

కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టరట్టు

ఇరాన్ ప్రతీకార దాడుల్లో ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాను సమీపించిన డ్రోన్!

Updated Date - Mar 01 , 2026 | 10:05 AM