మానవ మృగం.. గర్భిణి అని కూడా చూడకుండా..
ABN , Publish Date - Apr 13 , 2026 | 03:53 PM
జైపూర్‌లో మహిళలను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన జపాన్‌కు చెందిన మహిళా టూరిస్ట్‌ను కొంతమంది యువకులు వేధింపులకు గురిచేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: రాజస్థాన్‌లో సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ మానవ మృగం గర్భిణిపై రెచ్చిపోయాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఆమెపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన గత శనివారం(ఏప్రిల్ 11) చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శనివారం జైపూర్, మాల్వియా నగర్ ఏరియాలో ఓ గర్భిణి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. ఓ వ్యక్తి ఆమెను ఫాలో అవ్వటం మొదలెట్టాడు. గర్భిణి ఫోన్‌లో మాట్లాడుతూ ముందుకు వెళుతోంది. ఆ రోడ్డుపై ఎవ్వరూ లేని సమయం చూసి ఆ వ్యక్తి రెచ్చిపోయాడు.
గర్భిణి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఆమెతో అత్యంత నీచంగా ప్రవర్తించాడు. అతడు చేసిన పనికి గర్భిణి షాక్ అయ్యింది. కొన్ని క్షణాల పాటు ఆ వ్యక్తి వైపు అలా చూస్తూ ఉండిపోయింది. తర్వాత తేరుకుని అక్కడినుంచి పారిపోయింది. ఆ వ్యక్తి కూడా అక్కడినుంచి పారిపోయాడు. అక్కడి సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. పోలీసు ఉన్నతాధికారులు ఘటనపై సీరియస్ అయ్యారు. వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.
స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా, జైపూర్‌లో మహిళలను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన జపాన్‌కు చెందిన మహిళా టూరిస్ట్‌ను కొంతమంది యువకులు వేధింపులకు గురిచేశారు. ఏప్రిల్ 8వ తేదీన బైకుపై వెళుతున్న ఇద్దరు యువకులు.. యువతితో తప్పుగా ప్రవర్తించారు. మార్చి 26వ తేదీన జల్ మహాల్ దగ్గర విదేశీ యువతితో స్థానిక యువకులు సెల్ఫీలు తీసుకునే నెపంతో రెచ్చిపోయి ప్రవర్తించారు.
ఇవి కూడా చదవండి
క్రూడాయిల్ పైకి.. స్టాక్ మార్కెట్లు కిందకి..
జీవితం నాశనం చేసే అలవాట్లు ఇవే.. ప్రతి పురుషుడు తప్పక తెలుసుకోవాల్సినవి