పెళ్లి చేసుకున్న ఇద్దరు మగాళ్లు.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Jun 20 , 2026 | 07:58 AM
ఒడిశా రాష్ట్రంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. వర్షాలు పడటం కోసం ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఒడిశా రాష్ట్రంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. వర్షాలు పడటం కోసం ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. జాజ్‌పూర్ జిల్లాలోని గంహారియా గ్రామంలో ఎండలు దంచికొడుతున్నాయి. రుతు పవనాలు ప్రారంభమైనా వర్షాలు పడకపోవటంతో జనం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే శతాబ్దాలుగా ఆ ఊరి జనం పాటిస్తున్న సంప్రదాయం తెరపైకి వచ్చింది. ఊరిలో వర్షాలు పడాలంటే ‘అందిర బిబాహ’ జరిపించాలని పెద్ద నిశ్చయించారు. ‘అందిర బిబాహ’లో భాగంగా ఇద్దరు మగాళ్లకు పెళ్లి చేస్తారు.
ఆ జంట ఒక రోజు భార్యాభర్తలుగా కలిసి ఉంటుంది. తర్వాత ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్లిపోతారు. ఇలా మగాళ్లకు పెళ్లి చేయటం వల్ల వర్షాలు పడతాయని ఆ గ్రామ ప్రజల నమ్మకం. ‘అందిర బిబాహ’ కోసం 29 ఏళ్ల జతిన్ కతువా, 27 ఏళ్ల కలాండి నాయక్ ముందుకు వచ్చారు. పెళ్లి కోసం గ్రామస్థులు చకచకా ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం సాయంత్రం జతిన్ వరుడి దుస్తుల్లో కారులో పెళ్లి తంతు జరిగే సిద్ధేశ్వరి గుడి దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ వధువు దుస్తుల్లో కలాండి సిద్ధంగా ఉన్నాడు. వేద మంత్రాలు, మేళతాళాల మధ్య పెళ్లి తంతు పూర్తయింది.
ఆ తర్వాత గుడి ప్రాంగణంలోనే భోజనాలు ఏర్పాటు చేశారు. జనం భోజనం చేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. లక్ష్మణ్ కతువా అనే వ్యక్తి పెళ్లి కుమారుడి తండ్రిగా వ్యవహరించాడు. మనగోబింద నాయక్ అనే వ్యక్తి పెళ్లి కూతురి తండ్రిగా వ్యవహరించాడు. భోజనాల తర్వాత అప్పగింతలు పూర్తయ్యాయి. సంప్రదాయం ప్రకారం ఓ రోజు మొత్తం ఈ జంట కలిసి ఉంది. తర్వాత జతిన్, కలాండి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి
ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం!
వ్యూస్ కోసం అమాయకుల ప్రాణాలతో చెలగాటం.. ఇదో చెత్త ట్రెండ్..