నాక్‌టూరిజం.. నిశీధి వేళ... నిశ్శబ్దంగా...
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:29 AM
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం అనేది ఊపందుకుంటూనే ఉంది. ఇంట్లో కూర్చోకుండా... కొత్త ప్రదేశాల్లో విహరిస్తూ, సరికొత్త అనుభూతులను సొంతం చేసుకునేందుకు పర్యాటకులు తెగ ఉత్సాహం చూపుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం అనేది ఊపందుకుంటూనే ఉంది. ఇంట్లో కూర్చోకుండా... కొత్త ప్రదేశాల్లో విహరిస్తూ, సరికొత్త అనుభూతులను సొంతం చేసుకునేందుకు పర్యాటకులు తెగ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో చాలాసార్లు ‘ఓవర్ టూరిజం’ రద్దీవల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించేదే ‘నాక్‌టూరిజం’ లేదా నాక్టోటూరిజం. అంటే రాత్రి పూట పర్యాటకం. ఇటీవల బాగా పాపులర్ అవుతోన్న ఈ సరికొత్త ట్రావెల్ ట్రెండ్‌పై ఓ లుక్కేద్దాం...
ఏ పర్యాటక ప్రాంతానికి వెళ్లినా... అక్కడ సందర్శక ప్రదేశాలను చూడడం, రావడం మామూలే. క్యూలో నిల్చుని టికెట్ తీసుకుని, లోపలికి వెళ్లి ఆ రద్దీలో, సందడిలో, హడావుడిగా ఆ ప్రదేశాన్ని పరిశీలించి, వాస్తు నిర్మాణ కౌశలానికి అబ్బురపడి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి గబాగబా నాలుగు ఫొటోలు తీసుకుని ఇంటికి వచ్చే వరకు మనసు కుదుటపడదు. నింపాదిగా అన్నీ చూడాలనే కోరిక ఉన్నా ఆ జనం... ఆ కాలుష్యం... ఎండలో ఎక్కువ సేపు నిలబడలేం.
ఈ ఓవర్ టూరిజం వల్ల చాలా మంది పర్యటనలంటేనే విసుగు ప్రదర్శిస్తున్నారు. ఆలయాలు, జాతీయ పార్కులు, వాస్తు కట్టడాలు, మంచుకొండలు, సరస్సులు... ఎక్కడ చూసినా జనాలే జనాలు. సందడే సందడి... రణగొణ ధ్వనులే. అందుకే కొంతమంది రాత్రి పర్యాటకానికి జై కొడుతున్నారు. అలాంటివారి ఆసక్తికి తగినట్టు... తెలివిగా రాత్రి వేళల్లోనే సందర్శించాల్సిన ప్రదేశాలతో ఐటినరీ రూపొందిస్తున్నారు ట్రావెల్ ఆర్గనైజర్లు. ఈ సరికొత్త ట్రెండ్‌ను ‘నాక్‌టూరిజమ్’ అంటున్నారు. ఇది నాక్టర్నల్ (రాత్రి), టూరిజం (పర్యటన) అనే రెండు పదాల నుంచి వచ్చింది. రాత్రివేళ... అంతా సద్దుమణిగాక ఈ పర్యటన మొదలవుతుందన్నమాట.
నవతరం రూటు మారింది...
ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ బుకింగ్ డాట్ కామ్, మీడియా సంస్థ మెల్ట్‌వాటర్‌తో కలిసి ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. 2025లో భారతీయ పర్యాటకుల్లో ప్రతీ నలుగురిలో ముగ్గురు రాత్రివేళ పర్యటనలు చేయాలని కోరుకుంటున్నారట. గత ఏడాది ట్రావెల్ పరంగా బాగా పాపులర్ అయిన పదం ‘నాక్‌టూరిజం’ అని ఆ సర్వేలో తేలింది. మిలీనియల్స్‌లో నలభై శాతం మంది ఈ నాక్‌టూరిజాన్ని ఎంచుకుంటున్నారట.
వినడానికి పేరు కొత్తగా ఉంది కానీ, మనకు ఇలాంటి అనుభూతులు కొత్తేంకాదు. వేసవి సెలవుల్లో అమ్మమ్మ గారింట్లో రాత్రిళ్లు ఆరుబయట లేదా డాబాపైన నక్షత్రాలు లెక్కిస్తూ పడుకున్న అనుభవం నిన్నటి తరానిది. పున్నమి వెన్నెల్లో గోదారిలో, కృష్ణలో పడవ ప్రయాణం చేయాలన్నది చాలామంది కోరిక. ఇలా ఓ క్షణం, అర క్షణం అని కాకుండా... ఇలాంటి అనుభూతిని పూర్తిగా ఆస్వాదించడం నాక్‌టూరిజం ప్రత్యేకత. నాక్‌టూరిజంలో స్టార్ గేజింగ్, మూన్‌లైట్ సఫారీ, ఆస్ట్రో వాక్, నైట్ సఫారీ, నార్తర్న్ లైట్ టూర్, ఆఫ్టర్ డార్క్ సిటీ, ఆర్కిటెక్చర్ టూర్... ఇలా అనేకం కొత్తకొత్తగా వచ్చేశాయి. ఏ నగరానికి వెళ్లినా అక్కడ టూర్లలో ఇప్పుడు ఈ నైట్ ట్రిప్స్‌ను కూడా కొత్తగా చేరుస్తున్నారు. నాక్‌టూరిజంలో బాగా ప్రసిద్ధి చెందిన యాత్రలివి...
నైట్ సఫారీలు...
ఆఫ్రికన్ సఫారీలో ముప్పై శాతం జంతువులు మాత్రమే పగటి పూట కనిపిస్తాయి. మిగతావన్నీ కూడా ఆ సమయంలో నిద్రపోతుంటాయి. అందుకే నైట్ సఫారీలు ఊపందుకున్నాయి. ఈ సమయంలో అరుదైన జంతు సమూహాలను చూసే అవకాశం లభిస్తుందని అంటారు ట్రావెలర్స్. పైగా రాత్రిపూట అడవిలో జంతువులను చూడటం ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. మడగాస్కర్, కోస్తారికాలలోని రెయిన్ ఫారెస్ట్ లాడ్జి నిర్వాహకులు రాత్రి వేళల్లో ‘వైల్డ్‌లైఫ్ వాక్స్’ నిర్వహిస్తున్నారు. యూరప్‌లో ప్రతీ జూన్‌లో ‘బ్రౌన్ బేర్స్’ను చూడడానికి రాత్రి నడకలు, స్కాండినేవియన్ దేశాల్లో నక్కల కూతలను వినేలా ‘వూల్ఫ్ ప్యాక్ ఏరియా క్యాంపు’ల పేరుతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు టూర్ ఆపరేటర్లు. ప్రకృతి సహజ వాతావరణాల్లో వన్యప్రాణులను చూడాలనే ఆలోచన ప్రజల్లో ఇంతగా పెరగడానికి కారణం వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీలేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నక్షత్ర వీక్షణలు...
గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ‘నిశీధి ఆకాశ’ పర్యటనలు ఓ ఉద్యమంలా ఊపందుకున్నాయి. హాలీడే కోసం వెళ్తున్న వారిలో చాలామంది ‘‘మీ హోటల్‌లో ‘నైట్ స్కై’ ఆప్షన్ ఉందా?’’ అని ఎంక్వయిరీలు చేసి మరీ బుక్ చేసుంటున్నారట. అమావాస్య చీకటిలో... మైదానాల్లో కింగ్ సైజ్ పరుపు మీద మేను వాల్చి నక్షత్రాలను చూడాలని అనుకునే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. వీటిని పర్యాటక భాషలో ‘స్టార్ బెడ్స్’ అంటున్నారు. ఆఫ్రికన్ సఫారీలలో ఈ స్టార్ బెడ్‌లూ మిళితమయ్యాయి. నైట్ సఫారీలతో పాటు నక్షత్రాల కనువిందారగించాలనుకునే వారే అంతా. ప్రశాంత, ఏకాంత దీవుల్లో ‘స్లీప్ అండర్ ద స్టార్స్’ (కాలుష్యం లేని ఆకాశంలో నక్షత్రాలను చూసే) అనుభూతిని మాల్దీవులు ప్రత్యేకంగా అందిస్తోంది. ‘మిలియన్ స్టార్స్ హోటల్’ పేరున విశేషమైన బస ఏర్పాట్లు చేస్తోంది స్విట్జర్లాండ్. ఇవన్నీ కూడా నక్షత్రాల ఆకాశాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పించేవే. సౌతాఫ్రికా, మడగాస్కర్ లాంటి దేశాలలో గైడెడ్ మూన్‌లైట్ ట్రెక్‌లను నిర్వహిస్తున్నారు.
కొవ్వొత్తుల వెలుగులు ...
టోక్యో (జపాన్)లో 70 శాతం యువ టూరిస్టులు రాత్రిపూట పర్యటనలకే ప్రాముఖ్యం ఇస్తున్నారని సర్వేల్లో తేలింది. అక్కడి పురాతన ఆలయం ‘సెన్సో జి’ రాత్రి వేళల్లో భలేగా ఉంటుంది. చాలామంది పర్యాటకులు సుమిదా నదిలో రాత్రిపూట క్రూయిజ్‌లలో తిరుగుతూ... టోక్యోను కొంగొత్తగా పరిచయం చేసుకుంటుంటారు. ఇక ప్రాచీన దేశం జోర్డాన్‌లో ‘పెట్రా బై నైట్’ టూర్లు చాలా ప్రసిద్ధి. ఈ సమయంలో పెట్రా ముందు వేల కొవ్వొత్తులను వెలిగిస్తారు. వారంలో ఓరోజు మాత్రమే ఈ టూర్‌ను నిర్వహిస్తున్నారు. మన దగ్గర పున్నమి సమయంలో ఐదు రాత్రుల పాటు తాజ్‌మహల్‌లో నైట్ వ్యూయింగ్ టికెట్లను ఆర్కియలాజికల్ సర్వే విక్రయిస్తోంది.
రాత్రి ఎనిమిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు ఎనిమిది సెషన్స్‌లో 50 మంది చొప్పున లోపలికి అనుమతి ఇస్తారు. ఈ టికెట్లకు భారీ డిమాండ్ ఉంటోంది. అయితే శుక్రవారం, రంజాన్ మాసాల్లో మాత్రం ఈ సెషన్స్‌ను రద్దు చేస్తారు. పున్నమి వెన్నెలలో తాజ్‌మహల్‌ని చూస్తే అవ్యక్తానందం కలుగుతుంది. తైపే, సియోల్, ఈస్ట్ ఏషియా, లాటిన్ అమెరికాలోని నైట్ మార్కెట్లలో రుచులను ఆస్వాదించడానికే కాదు... ఆయా నగరాలను విభిన్నంగా వీక్షించడానికి కూడా పర్యాటకులు క్యూలు కడుతున్నారు. అందుకే వీటిని ‘ఫుడ్ థీమ్డ్ ట్రిప్స్ ఎట్ నైట్’ అని పేర్కొంటున్నారు.
రంగుల తుపానులు...
ఉత్తర ధృవ ప్రాంతాల్లో రాత్రి పూట ఆకాశంలో అనేక రంగులతో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. వీటినే ఉత్తర జ్యోతులు లేదా ‘అరోరా బొరియాలిస్’ అని పిలుస్తారు. ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకు ఈ కాంతి పుంజాలు కనువిందు చేస్తాయి. యూరప్‌లో అనేకమంది ట్రావెల్ ఏజెంట్లు అరోరాలను చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక విమానాలు, వసతులు, ఆహారాలు అన్నీ ఇందులో భాగం అయ్యాయి. గత ఏడాది ‘నార్తర్న్ లైట్స్’ పర్యాటకం 900 మిలియన్ డాలర్లుగా నమోదయ్యిందని పర్యాటక నిపుణులు తెలిపారు. రానున్న కాలంలో ఈ రంగుల తుపానుల పర్యటనలు మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు.
వీటన్నింటికీ తోడు సముద్రాల్లో ‘నైట్ డైవ్స్’ కూడా వచ్చేశాయి. జంతు ప్రేమికులు రాత్రుళ్లు సముద్రాల్లో డైవ్ చేస్తూ పగడపు దీవులు, రంగుల చేపల ప్రపంచాన్ని చూసి విభ్రాంతికి గురవుతున్నారు. ఆ విభిన్న లోకంలో తమని తామే మరచిపోతున్నారు.
ప్రస్తుతం కాంతి కాలుష్యం ప్రతీ ఏడాదికి పది శాతం పెరుగుతోంది. దాంతో పావు భాగం ప్రపంచానికి పాలపుంత కనిపించడమే లేదు. అందుకే నక్షత్రాల ఆకాశాన్ని వెతుక్కుంటూ పర్యాటకులు బయల్దేరుతున్నారు. ‘డార్క్ స్కై ఇంటర్నేషనల్’ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1 లక్షా 60 వేల చదరపు మైళ్ల ప్రాంతాన్ని ‘డార్క్ స్కై రిజర్వ్’లు, పార్క్‌లుగా విభజించింది. అక్కడ ఎందరో టూర్ ఆపరేటర్లు నక్షత్ర యాత్రలను నిర్వహిస్తూ టూరిస్టులను ఆకర్షిస్తున్నారు. ఇలా నవతరం అభిరుచిని బట్టి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల నైట్ టూర్లు పర్యాటకులను సరికొత్త లోకాల్లో విహరించేలా చేస్తున్నాయి. కొత్తదనాన్ని ఆస్వాదించాలనుకునేవాళ్లు నిశీధి వేళల్లో... ఇలాంటి అనేక సాహసాలకు సై అంటూ బ్యాగులు సర్దుకుంటున్నారు. జోరు చూస్తుంటే... ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు.
- డి.పి.అనురాధ
ఇవి గుర్తుంచుకోండి...
రెగ్యులర్ టూరిజం కాకుండా... ‘నాక్‌టూరిజం’ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారా? అయితే ఈ విషయాలు గుర్తించుకోవాలి.
పరిశోధన: నాక్టర్నల్ ట్రావెల్ చేయాలనే ఆలోచనే కొత్తది. కాబట్టి ఈ ఆలోచన ఉన్నవాళ్లు కాస్త పరిశోధన చేయాలి. డార్క్ స్కై శాంక్చురీలు, లొకేషన్ల గురించి లిస్టు చేసుకోవాలి.
రాత్రి వేళ కార్యక్రమాలు:
నైట్ సఫారీలు, స్టార్‌గేజింగ్
టూర్లు, సాయంత్రం
సాంస్కృతిక కార్యక్రమాలు
జరిగే ప్రదేశాల గురించి తెలుసుకోవాలి.
అవసరమైన వస్తువులు: క్వాలిటీ కెమెరా, నైట్ విజన్ అద్దాలు, వెచ్చని దుస్తులు, ఫ్లాష్ లైట్ తప్పనిసరి. అడవుల్లో జంతువులను చూసేందుకు వెళితే, మెరిసే దుస్తులు ధరించరాదు.
స్థానిక సంస్కృతిని గౌరవించడం: ఏ ప్రదేశం వెళ్లినా స్థానిక ఆచార వ్యవహారాలను, అక్కడి సంస్కృతిని గౌరవించడం మంచిది.
ఎందుకు పెరుగుతోంది?
‘నాక్‌టూరిజం’ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా...
రద్దీ నుంచి విముక్తి: పగటి పూట ప్రతీ టూరిస్టు ప్రదేశంలో అత్యధిక రద్దీ ఉంటుంది. చాలామంది ఆ రద్దీని తప్పించుకోవడానికి నాక్‌టూరిజం వైపు దృష్టి పెడుతున్నారు. అలసట, ఆందోళన లేకుండా హాయిగా యాత్ర చేసుకుని, చిక్కటి జ్ఞాపకాలను మోసుకు వెళుతున్నారు.
పర్యావరణ పరిరక్షణ : ఇప్పుడిప్పుడే ఊపందుకున్న ‘డార్క్ స్కై మూమెంట్’ పరోక్షంగా పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తోంది. ఎకో టూరిజం, కాంతి కాలుష్యం, వన్యప్రాణుల పరిరక్షణ తదితరాల గురించి అవగాహన కలిగిస్తోంది. అందుకే ఈ ప్రయాణాలు మరింత అర్థవంతంగా మారుతున్నాయి.
విభిన్నమైన అనుభూతి: రెగ్యులర్‌గా డే టైమ్‌లో ఆయా ప్రాంతాలను చూడటం మామూలే. అదే రాత్రుళ్లు చేసే ప్రయాణాలు యువతరంలో సరికొత్త కిక్‌ను ఇస్తున్నాయి. ఆయా కథల్లో చదివే ఫాంటసీ అంశాలను వ్యక్తిగతంగా అనుభూతి చెందుతున్నారు.
ప్రసిద్ధ ఆకర్షణలివి...
రాత్రివేళ సందర్శనకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లో కొన్ని...
నమీబ్‌ర్యాండ్ నేచర్ రిజర్వ్- నమీబియా
రోమ్ - ఇటలీ
ఆరోకి మెకంజీ ఇంటర్నేషనల్
డార్క్ స్కై రిజర్వ్
న్యూజీలాండ్
థార్ ఎడారి - జైసల్మేర్, ఇండియా
థాయ్ హ్యాంగ్ ఫైర్
డ్రాగన్ డాన్స్- హాంకాంగ్
కుంబు బేస్‌క్యాంప్ - మౌంట్ ఎవరెస్ట్
యూకాన్ టెర్రిటరీ - కెనడా
పైడ్‌మోంట్ - ఇటలీ
కూర్గ్ - కర్ణాటక, ఇండియా
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ
Read Latest Telangana News and National News