కొత్త కారు బానెట్‌పై భార్య పాదముద్రలు.. దంపతుల వీడియో వైరల్..
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:59 PM
కొత్త వస్తువు ఏదైనా కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఎవరైనా ఏం చేస్తారు. పసుపు, కుంకుమ రాసి ఆ తర్వాత ఆ వస్తువును వాడుకుంటారు. ఇక వాహనం అయితే దేవాలయం వద్ద పూజలు చేయిస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: కొత్త వస్తువు ఏదైనా కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఎవరైనా ఏం చేస్తారు.. పసుపు, కుంకుమ రాసి ఆ తర్వాత ఆ వస్తువును వాడుకుంటారు. ఇక వాహనం అయితే దేవాలయం వద్ద పూజలు చేయిస్తారు. కానీ ఈ దంపతులు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. కొత్త కార కొన్న వ్యక్తి.. షోరూంలోనే కారు బానెట్‌పై పసుపు, బంతిపూలతో పూజ చేశారు. అనంతరం భార్యను ఎత్తుకుని.. కారు బానెట్‌పై పాదముద్రలు వేయించాడు. పాదాలకు కుంకుమ రాసి.. ఆ ముద్రలు వేయించాడు.
కార్ల షోరూంలో సిబ్బంది సమక్షంలో ఆ దంపతులు ఈ పని చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించి, లైక్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు ఆ దంపతులను ప్రశంసిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంకొందరు గతంలో జరిగిన ఇదే తరహా సంఘటనలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఇది గృహప్రవేశానికి సంబంధించిన ఆచారాన్ని పోలి ఉందని అంటున్నారు. వధువు తన కొత్త ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు, ఆమె పాదాలకు కుంకుమ పూసి అడుగులు వేస్తే ఆ కుటుంబానికి శ్రేయస్సుతోపాటు శుభారంభానికి ప్రతీకగా భావిస్తారని పేర్కొన్నారు. స్త్రీ.. శక్తితో సమానమని, ఆమె కుంకుమతో వేసిన ఎర్రటి పాదముద్రలు సంపదతో ముడిపడి ఉంటుందని వివరిస్తున్నారు. కారు కొనుగోలులో ఆమె ప్రమేయం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఏమైనా ఈఎంఐ చెల్లిస్తుందా? అంటూ ఇంకొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.