భారత్‌లో లభించే కిట్‌కాట్ చాక్లెట్‌లల్లో నాణ్యత తక్కువా? క్లారిటీ ఇచ్చిన సంస్థ
ABN , Publish Date - Feb 13 , 2026 | 10:29 PM
భారత్‌లో లభించే కిట్‌కాట్ చాక్లెట్‌ల రెసిపీ, అస్ట్రేలియాలో లభించే వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటుందని ఓ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ పెట్టిన పోస్టు పెద్ద చర్చకు దారి తీసింది. జనాల చర్చ చాక్లెట్ నాణ్యతవైపు మళ్లడంతో స్వయంగా నెస్లే సంస్థ స్పందించి వివరణ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో నెస్లే విక్రయించే కిట్‌కాట్ చాక్లెట్‌ల రెసిపీ ఆస్ట్రేలియాలోని చాక్లెట్స్‌తో పోలిస్తే భిన్నంగా ఉంటుందంటూ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రేవంత్ హిమత్‌సింగ్కా పెట్టిన పోస్టు నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో, నెస్లే స్వయంగా ఈ విషయంపై స్పందించాల్సి వచ్చింది (Nestle Kitkat Aus Vs Ind).
ఆస్ట్రేలియాలో లభించే కిట్‌కాట్ చాక్లెట్‌లతో భారతీయ కిట్‌కాట్ చాక్లెట్లను పోల్చుతూ రేవంత్ హిమత్‌సింగ్కా ఈ కామెంట్ చేశారు. ఆస్ట్రేలియా కిట్‌కాట్ చాక్లెట్స్‌లో కొకోవా గింజల శాతం 22గా, పాల ఉత్పత్తుల శాతం 20గా ఉంటుందని చెప్పారు. అయితే, భారత్‌లో లభించే వాటిల్లో మాత్రం ఇవి వరుసగా 4.5 శాతం, 16.1 శాతంగా ఉన్నాయని తెలిపారు.
భారత్‌లో వినియోగదారులకు ధరల విషయంలో పట్టింపు ఎక్కువ కాబట్టి కంపెనీలు తమ ఉత్పత్తుల్లో స్థానిక మార్కెట్‌లకు తగినట్టు మార్పులు చేస్తాయని తెలిపారు. నిబంధనల అమలు అంత కఠినంగా ఉండకపోవడం కూడా ఒక కారణం కావొచ్చని అన్నారు. వినియోగదారుల్లో అవగాహన లేకపోవడం కూడా ఈ పరిస్థితికి దారి తీస్తోందని తెలిపారు. చాలా మంది ఆహార ఉత్పత్తుల ప్యాకెట్‌లపై లేబుల్స్‌ను పూర్తిగా చదవకుండానే కొనుగోలు చేస్తారని అన్నారు. దీంతో, ఇలాంటి మార్పులు జనాల దృష్టిలోకి అంతగా రావని చెప్పుకొచ్చారు.
ఇక ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ధరల్లో స్వల్ప పెరుగుదలకు వినియోగదారులు గోల చేస్తారని కొందరు ఆరోపించారు. అధిక ధర పెట్టే స్తోమత ఉన్న వారికి సహజంగానే మంచి నాణ్యతతో కూడిన వస్తువులు అందుబాటులో ఉంటాయని అన్నారు.
ఇలా చర్చ పతాకస్థాయికి చేరుకోవడంతో చివరకు నెస్లే సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్పత్తులను కొత్తగా అందించే క్రమంలో అంతర్జాతీయ సంస్థలు రెసిపీల్లో మార్పులు చేస్తాయని పేర్కొంది. ఇది నాణ్యతను తగ్గించినట్టు కాదని స్పష్టం చేసింది. వినియోగదారుల అంచనాలు, అభిరుచులు, స్థానికంగా ముడిసరుకుల లభ్యత, వాతావరణం, ఉత్పత్తుల విక్రయానికి పట్టే సమయం, స్థానిక చట్టాలు వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తుల రెసిపీల్లో మార్పులు ఉంటాయని నెస్లే ప్రతినిధి తెలిపారు.
ఇవీ చదవండి:
యూట్యూబ్ ఛానల్ కోసం ఆస్తులమ్మి.. వ్యూస్ రాలేదనే కోపంలో..
రౌడీ షీటర్‌తో మహిళా కానిస్టేబుల్ జంప్! ఆగిపోయిన పెళ్లి