Share News

అజిత్ పవార్ మరణం.. నెరవేరని అభిమాని శపథం.. పాపం ఇలా..

ABN , Publish Date - Jan 30 , 2026 | 02:53 PM

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ మృతితో ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఓ వీరాభిమానికి చెందిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

అజిత్ పవార్ మరణం.. నెరవేరని అభిమాని శపథం.. పాపం ఇలా..
Nagpur NCP worker

ముంబై, జనవరి 30: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న మినీ విమానం బారామతి ఎయిర్‌పోర్టు దగ్గర కుప్పకూలిపోయింది. అజిత్ పవార్‌తో పాటూ మరో నలుగురు ఈ ప్రమాదంలో చనిపోయారు. అజిత్ పవార్ మృతితో ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఓ వీరాభిమానికి చెందిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అజిత్ పవార్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆ వీరాభిమాని కలలు కన్నాడు. అంతటితో ఆగకుండా శపథం కూడా చేశాడు. ఆ శపథం నెరవేరకుండానే అజిత్ పవార్ చనిపోయారు. అభిమాని కల కలగానే మిగిలిపోయింది.


ఇంతకీ స్టోరీ ఏంటంటే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా, ఉమ్రెడ్ తాలూకాకు చెందిన విలాస్ జోదపే అనే వ్యక్తికి అజిత్ పవార్ అంటే ఎంతో అభిమానం. అందుకే ఎన్‌సీపీలో చేరి పార్టీ కోసం తనవంతు కృషి చేస్తున్నాడు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో విలాస్ ఓ శపథం చేశాడు. అజిత్ పవార్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ తాను జుట్టు కత్తిరించుకోనని తేల్చి చెప్పాడు. ఆ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమి భారీ మెజార్టీతో గెలిచింది. 280 సీట్లకు గానూ 235 సీట్లు సాధించింది. ఎన్‌సీపీ 50 సీట్లలో పోటీ చేయగా.. 41 సీట్లు గెలిచింది.


అయితే, ముఖ్యమంత్రి పీఠం దేవేంద్ర ఫడ్నవీస్‌కు దక్కింది. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తన నాయకుడి మీద ఉన్న నమ్మకంతో విలాస్ జుట్టు కత్తిరించుకోలేదు. ఎప్పటికైనా అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతాడని నమ్మాడు. ఏడాది నుంచి జుట్టు పెంచుతూనే ఉన్నాడు. ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా విమాన ప్రమాదంలో అజిత్ పవార్ చనిపోయారు. ఈ విషయం తెలిసి విలాస్ గుండె ముక్కలైంది. కన్నీరుమున్నీరుగా విలపించాడు. తన అభిమాన నాయకుడికి నివాళి అర్పిస్తూ గుండు చేయించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు విలాస్‌పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

బాంబు బెదిరింపు.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

చరిత్ర సృష్టించనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Updated Date - Jan 30 , 2026 | 04:24 PM