ప్రపంచ స్థాయిలో గుర్తింపు.. అయినా మురికివాడలోనే జీవితం..
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:09 PM
మలీసా సూపర్ మోడల్‌గా ఊహించని పాపులారిటీ తెచ్చుకుంది. కాస్మోపోలిటన్, వోగ్ వంటి మ్యాగజైన్స్ కవర్ పేజీల్లో కనిపించే స్థాయికి ఎదిగింది. ఇంత గుర్తింపు తెచ్చుకున్నా ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి మారలేదు.
ఇంటర్‌నెట్ డెస్క్: సోషల్ మీడియా పుణ్యమా అని భారతదేశానికి చెందిన ఎంతో మంది సాధారణ వ్యక్తులు రాత్రికి రాత్రి సెలబ్రిటీలు అయిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. వచ్చిన ఫేమ్‌ను వాడుకుని కొంతమంది మాత్రమే బాగా డబ్బులు సంపాదించి లైఫ్‌లో సెటిల్ అయ్యారు. మరికొంత మంది మళ్లీ పాత జీవితంలోనే మగ్గిపోతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ అమ్మాయి మురికివాడలో పుట్టి పెరిగి సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీ అయిపోయింది. సూపర్ మోడల్‌గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎంత గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆమె ఆర్థిక పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ మురికివాడలోనే జీవితం గడుపుతోంది.
మురికివాడ టు సూపర్ మోడల్
ముంబై సముద్ర తీర ప్రాంతానికి చెందిన మలీసా కార్వా తన తల్లిదండ్రులతో కలిసి మురికివాడలో జీవిస్తోంది. పేదరికం కారణంగా మలీసా తనకు ఐదేళ్లు ఉన్నపుడే పనులు చేయటం మొదలెట్టింది. సముద్ర తీరానికి వచ్చే టూరిస్టులకు ఆమె టిష్యూ పేపర్లు అమ్మేది. మలీసా తండ్రి నెల మొత్తం కలిపినా రూ.300 మాత్రమే సంపాదించేవాడు. మలీసా ఆయనకంటే ఎక్కువ సంపాదించేది. టూరిస్టులను పలకరించి, వారితో కలిసి ఇంగ్లీష్‌లో మాట్లాడటం ఆమెకు అలవాటు. ఇంగ్లీష్ ప్రాక్టీస్ అయ్యేందుకు ఇలా చేసేదామె. అదే ఆమె జీవితాన్ని మార్చింది. ఓ వ్యక్తి ఆమెలోని మోడల్‌ను గుర్తించి జీవితాన్నే మార్చేశాడు.
తక్కువ కాలంలో మలీసా సూపర్ మోడల్‌గా ఊహించని పాపులారిటీ తెచ్చుకుంది. కాస్మోపోలిటన్, వోగ్ వంటి మ్యాగజైన్స్ కవర్ పేజీల్లో కనిపించే స్థాయికి ఎదిగింది. ఇంత గుర్తింపు తెచ్చుకున్నా ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మారలేదు. ఇంకా సముద్ర తీరంలోని మురికివాడల్లోనే నివసిస్తోంది. ఇప్పటివరకు ఆమె ఇంటిని అధికారులు 12 సార్లు కూల్చేశారు. మళ్లీ ఎప్పుడు కూల్చేస్తారోనన్న భయంతో మలీసా కుటుంబం అల్లాడిపోతోంది. అయినప్పటికీ మలీసా గట్టి పట్టుదలతో ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా.. నష్టాలు వచ్చినా అనుకున్నది సాధించి తీరాలంటోంది.
ఇవి కూడా చదవండి
శశిథరూర్‌తో సీపీఎం మంతనాలు.. ఆయన ఏమన్నారంటే..
చైనా అణు రహస్యాలు అమెరికాకు లీక్ అయ్యాయా.. టాప్ జనరల్‌పై దర్యాఫ్తు..