Share News

ముంబై ఆటో డ్రైవర్ తెలివికి నెటిజన్లు ఫిదా..!

ABN , Publish Date - Aug 30 , 2026 | 05:27 PM

ప్రయాణికులతో మాట్లాడేందుకు భాష అడ్డంకిగా మారితే ఏం చేయాలి?.. ఈ సమస్య పరిష్కారానికి ఓ ముంబై ఆటో డ్రైవర్ చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణికులతో రోజూ ఎదురయ్యే సాధారణ సంభాషణలను సులభంగా మాట్లాడేందుకు అతను వినూత్నంగా ఆలోచించాడు.

ముంబై ఆటో డ్రైవర్ తెలివికి నెటిజన్లు ఫిదా..!
Mumbai Auto Driver

ముంబై: ప్రయాణికులతో మాట్లాడేందుకు భాష అడ్డంకిగా మారితే ఏం చేయాలి?.. ఈ సమస్య పరిష్కారానికి ఓ ముంబై ఆటో డ్రైవర్ చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణికులతో రోజూ ఎదురయ్యే సాధారణ సంభాషణలను సులభతరం చేసేందుకు వినూత్నంగా ఆలోచించాడు. రెండు భాషలకూ సంబంధించిన చేతిరాతతో కూడిన అనువాద వాక్యాల షీట్‌ను ఆటోలో అంటించుకున్నాడు. అందులో హిందీ వాక్యాలకు ఎదురుగా మరాఠీ అనువాదాలను రాసుకున్నాడు. ఈ ప్రయత్నం ప్రయాణికుల దృష్టిని ఆకర్షించింది.


ముంబైలో సదరు డ్రైవర్ ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ దృష్టిని ఈ ప్రత్యేకమైన షీట్ ఆకర్షించింది. వెంటనే దాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్రైవర్ మరాఠీ నేర్చుకునే క్రమంలో ప్రయాణికులతో మాట్లాడేందుకు తరచూ అవసరమయ్యే వాక్యాలను ఆ పేపర్‌పై రాశాడు. హిందీలోని సాధారణ పదబంధాలను మరాఠీలో ఎలా చెప్పాలో అందులో పొందుపరిచాడు. అవసరమైనప్పుడు వాటిని చూసుకుంటూ ప్రయాణికులతో మాట్లాడుతున్నాడు. అలాగే, హిందీ రాని ప్రయాణికులు మరాఠీ వాక్యాలను చూసుకుని డ్రైవర్‌తో సంభాషిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ పదాలలో ‘చిల్లర లేదు’, ‘ఆటోను కాస్త ఆపండి’ వంటి పదబంధాలు ఉన్నాయి. దీంతో భాష సమస్య లేకుండా డ్రైవర్, ప్రయాణికులు సులభంగా మాట్లాడుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ పద్ధతి నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఒకవైపు జీవనోపాధి కోసం ఆటో నడుపుతూనే.. మరోవైపు ప్రయాణికులతో మెరుగ్గా మాట్లాడేందుకు మరాఠీ నేర్చుకోవాలన్న డ్రైవర్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ప్రయాణికులతో సులభంగా మాట్లాడేందుకు అతడు తయారు చేసుకున్న ఈ ‘చేతిరాత నోట్స్’ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి మనసులు గెలుచుకుంటోంది.


ఈ వార్తలు కూడా చదవండి

గోడపై నుంచి నీటిలోకి కోతుల జంప్‌.. చూస్తే నవ్వు ఆపుకోలేరు! వీడియో వైరల్

బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లలోనూ పెళ్లి రిజిస్ట్రేషన్.. చైనాలో ఎందుకిలా చేస్తున్నారంటే..

Updated Date - Aug 30 , 2026 | 05:34 PM