టూరిస్టులు తెచ్చే జంక్ ఫుడ్‌తో అవస్థలు.. ఎర్ర మట్టిని తింటున్న కోతులు
ABN , Publish Date - Apr 23 , 2026 | 02:28 PM
టూరిస్టులు తెచ్చే జంక్ ఫుడ్ తిని ఇబ్బందులు పడుతున్న కోతులు ఎర్ర మట్టి తిని సమస్య నుంచి బయటపడుతున్నట్టు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
ఇంటర్నె్ట్ డెస్క్: టూరిస్టులు తెచ్చే జంక్ ఫుడ్‌తో నానా అవస్థలు పడుతున్న కోతులు సొంత వైద్యం చేసుకుంటున్నట్టు తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి ఎర్ర మట్టి తింటూ ఉదర సంబంధిత సమస్యల నుంచి బయటపడుతున్నట్టు చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనం వివరాలు తాజాగా సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
యూకేకు చెందిన జిబ్రాల్టర్ ప్రాంతంలో శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. బార్బరీ మాకాక్ కోతులను రెండేళ్ల పాటు (2022-24) పరిశీలించారు. అవి మట్టి తిని ఉదర సంబంధిత సమస్యల నుంచి బయటపడుతున్న వైనాన్ని గుర్తించారు. అక్కడి కోతులు తినే ఆహారంలో దాదాపు 20 శాతం జంక్ ఫుడ్‌యేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెలొరీలు, చక్కెర, ఉప్పు, డెయిరీ ఉత్పత్తులు అధికంగా ఉన్న ఈ ఫుడ్ కారణంగా కోతులు అనారోగ్యం పాలవుతున్నాయి. అలాంటి సందర్భాల్లో మట్టి తిని సమస్య నుంచి బయటపడుతున్నాయని అన్నారు.
జంక్ ఫుడ్ కారణంగా కోతుల కడుపులోని హితకర బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం పడుతోందని పరిశోధకులు చెప్పారు. ఎర్ర మట్టి వల్ల వాటి కడుపులోని పీహెచ్ స్థాయి సమతులంగా ఉంటోందని, విషతుల్యాలు కూడా తొలగిపోతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాటి పేగుల్లోని హితకర బ్యాక్టీరియా కూడా పునరుద్ధరణకు గురవుతున్నట్టు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. జిబ్రాల్టర్‌లో టూరిస్టులు వదిలి వెళ్లే జంక్ ఫుడ్‌ను తిని కోతులు ఇబ్బందుల పాలవుతున్నాయి. అనేక సందర్భాల్లో టూరిస్టుల నుంచి లాక్కెళ్లి మరీ ఈ ఫుడ్‌ను తింటున్నాయి.
వాస్తవానికి కొన్ని జంతుజాతుల్లో ఈ అలవాటు ఉన్నప్పటికీ జిబ్రాల్టర్ కోతులు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా మట్టిని తింటున్నాయని కూడా తెలిపారు. ఇక మట్టితో కలిగే ఉపయోగాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
హోటల్ గదిలో దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన టూరిస్టులు..
3 నెలల పసికందును బంధించిన కోతి.. 2 గంటల తర్వాత..