3 నెలల పసికందును బంధించిన కోతి.. 2 గంటల తర్వాత..
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:31 PM
బిడ్డను కోల్పోయిన ఓ కోతి 3 నెలల పసికందును బంధించింది. 2 గంటల పాటు ఆ పసికందును విడవలేదు. ఉత్తర ప్రదేశ్‌లో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. బిడ్డను కోల్పోయిన ఓ కోతి 3 నెలల పసికందును బంధించింది. 2 గంటల పాటు ఆ పసికందును విడవలేదు. దీంతో పసికందు కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరకు అనిమల్ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి బిడ్డను క్షేమంగా పక్కకు తీసుకువచ్చింది. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌నగర్ జిల్లా, ఛర్తావాల్ పట్టణానికి చెందిన గులిస్తా అనే మహిళ తన 3 నెలల బిడ్డను మంచంపై పడుకోబెట్టి అక్కడి నుంచి పక్కకు వెళ్లింది.
కొద్దిసేపటి తర్వాత బిడ్డ ఏడుపు వినిపించటంతో మంచం దగ్గరకు వచ్చింది. అక్కడి దృశ్యాన్ని చూసి ఆమె షాక్ అయింది. ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు కానీ, ఓ కోతి బిడ్డ దగ్గరకు వచ్చింది. బిడ్డకు ఎలాంటి హాని చేయకుండా ఆడుకుంటూ ఉంది. భయపడిపోయిన గులిస్తా గట్టిగా కేకలు వేసింది. ఆ కేకలు విన్న కుటుంబసభ్యులు పరుగున అక్కడికి వచ్చారు. కోతిని బెదిరించి అక్కడినుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయితే, ఆ కోతి భయపడిపారిపోలేదు. కోపంతో జనం మీదకే తిరగబడింది. అన్నం పెట్టినా కూడా అది బిడ్డ నుంచి పక్కకు రాలేదు.
ఈ నేపథ్యంలోనే కుటుంబసభ్యులు అనిమల్ రెస్క్యూ టీమ్‌కు ఫోన్ చేశారు. అనిమల్ రెస్క్యూయర్ సన్నీ చోప్రా తన టీమ్‌తో అక్కడికి వచ్చాడు. ఆహారం చూపించి దాన్ని పక్కకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం విఫలమైంది. దీంతో సెల్‌ఫోన్‌లో వైల్డ్‌లైఫ్ వీడియోలు ప్లే చేసి దాని ముందు ఉంచాడు. అది ఎంతో శ్రద్ధగా వాటిని చూస్తున్న సమయంలో చాకచక్యంగా బిడ్డను పక్కకు తీసుకువచ్చాడు. కోతి కారణంగా బిడ్డకు చిన్న గాయం కూడా కాలేదు. సన్నీ చోప్రా మాట్లాడుతూ.. ‘ఆరు రోజుల క్రితం ఆ కోతి తన బిడ్డను కోల్పోయింది. పొరపాటున ఈ పసికందును తన బిడ్డ అనుకుని ఉంటుంది’ అని అన్నాడు.
ఇవి కూడా చదవండి
ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం
ఇలాంటి ప్రతిభ అరుదు.. వైభవ్ సూర్యవంశీపై క్రిస్ శ్రీకాంత్ ప్రశంసలు