Share News

మైక్రోసాఫ్ట్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాజీనామా.. అమ్మానాన్నల కోసం భారత్‌కు..

ABN , Publish Date - Oct 12 , 2026 | 01:09 PM

మైక్రోసాఫ్ట్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ కేశవన్ షన్ముగం రాజీనామా చేశారు. వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు చూసుకునేందుకు భారత్‌కు తిరిగివెళుతున్నట్టు చెప్పారు.

మైక్రోసాఫ్ట్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాజీనామా.. అమ్మానాన్నల కోసం భారత్‌కు..
Keshavan Shanmugam

ఇంటర్నెట్ డెస్క్: మైక్రోసాఫ్ట్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ కేశవన్ షన్ముగం రాజీనామా చేశారు. వృద్ధులైన తల్లిదండ్రుల కోసం బాగోగులు చూసుకునేందుకు భారత్‌కు తిరిగివెళుతున్నట్టు చెప్పారు. దాదాపు 23 ఏళ్లుగా ఆయన మైక్రోసాఫ్ట్‌లో సేవలందించారు. ఎక్సెల్‌లో కోపైలట్ ఇంటిగ్రేషన్, ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్‌ అభివృద్ధికి విశేష కృషి చేశారు.

ఏఐ బూమ్ ఉన్న ఈ సమయంలో సంస్థ నుంచి తప్పుకోవాలని నిర్ణయించడం అంత సులువు కాదని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కానీ కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాజీనామా చేయడం కష్టమైనా తప్పలేదని అన్నారు. ఇంతకాలం తనకు తోడ్పాటునందించినందుకు సహోద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. వారి వల్లే ఈ రెండు దశాబ్దాల కాలం ఉత్సాహంగా గడిచిందని అన్నారు.


ఈ పోస్టుపై టెక్ రంగం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వందల కొద్దీ కామెంట్స్ వచ్చాయి. తల్లిదండ్రుల కోసం కెరీర్‌ను కాదన్న ఆయన నిర్ణయాన్ని ప్రశంసించారు. ప్రపంచంలోనే టాప్ టెక్ కంపెనీలో అద్భుత కెరీర్‌ను కాదని కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం గొప్పనిర్ణయమని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఇంతకు మించిన మంచి నిర్ణయం మరొకటి ఉండదని అన్నారు. అయితే, అమెరికాలో మారుతున్న వీసా విధానాల నేపథ్యంలో షన్ముగం తప్పుకున్నారా? సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, షన్ముగం మాత్రం తన పోస్టులో ఎక్కడా వీసా అంశాల ప్రస్తావన తేలేదు. కేవలం తల్లిదండ్రులను చూసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

ఔషధాల్లాగా ఏఐనీ నియంత్రించాలి: బిల్ గేట్స్

చాట్‌జీపీటీతో తప్పుడు ప్రచారం.. రష్యా, ఇరాన్ అకౌంట్స్‌పై ఓపెన్ ఏఐ నిషేధం

Updated Date - Oct 12 , 2026 | 01:20 PM