Share News

ట్రాఫిక్‌ రద్దీలో టీనేజర్ల విన్యాసాలు.. తల్లిదండ్రులపై చర్యలకు సిద్ధమైన పోలీసులు

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:41 PM

మీరట్‌లో కొందరు స్కూల్ విద్యార్థులు స్కూటీపై ప్రమాదకరంగా స్టంట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.

ట్రాఫిక్‌ రద్దీలో టీనేజర్ల విన్యాసాలు.. తల్లిదండ్రులపై చర్యలకు సిద్ధమైన పోలీసులు
Meerut Minors Stunt

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో మైనర్ బాలురు, బాలికలు ట్రాఫిక్ రద్దీలో ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న ఉదంతాలు ఎన్నో వైరల్ అయ్యాయి. విమర్శలు వెల్లువెత్తాయి. యూపీలోని మీరట్‌లో తాజాగా అలాంటి ఉదంతమే వెలుగులోకి వచ్చింది. అయితే, పోలీసులు ఈసారి విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. చిన్నారుల ప్రమాదకర స్టంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఐదుగురు బాలురు మోపెడ్‌పై ప్రమాదకరమైన స్టంట్‌కు దిగారు. ఇద్దరే కూర్చోవాల్సిన మోపెడ్‌పై ఏకంగా ఐదుగురు ఎక్కారు. వారిలో ఒకడు ఏకంగా మరొకడి వీపుపై ఎక్కి మరీ కూర్చున్నాడు. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టలేని స్థితిలో వారు కేరింతలు కొడుతూ వాహనంపై దూసుకెళ్లారు. అదే రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తి ఉండబట్టలేక ఈ వీడియోను రికార్డు చేసి నెట్టింట షేర్ చేయడంతో విషయం వైరల్‌గా మారింది.


ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. చిన్నారులు ప్రమాదానికి ఎదురెళ్లడమే కాకుండా ఇతర వాహనదారుల ప్రాణాలతోనూ చెలగాటమాడుతున్నారని పలువురు మండిపడ్డారు. వీడియోపై మీరట్ ఎస్పీ కూడా స్పందించారు. ‘వాహనం సీజ్ చేస్తాం. ఇప్పటికే రూ.25 వేల జరిమానా కూడా విధించాము. చిన్నపిల్లలు ఇలా వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం. ఇందుకు పూర్తి బాధ్యత తల్లిదండ్రులే. వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాము’ అని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

బీట్‌కు తగ్గట్టుగా స్టెప్పులు.. రోబో డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా

మెట్రోలో సీటు దొరకలేదా.. ఈ చిట్కా ఫాలో అవ్వండి.. వీడియో వైరల్

Updated Date - Sep 25 , 2026 | 05:53 PM