Share News

స్విమ్మింగ్ పూల్‌లోకి డైవ్ చేసిన యువకుడు.. క్షణాల్లోనే..

ABN , Publish Date - Jun 29 , 2026 | 07:49 AM

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. కొంతమంది యువకుల విహారయాత్ర విషాదాంతంగా ముగిసింది.

స్విమ్మింగ్ పూల్‌లోకి డైవ్ చేసిన యువకుడు.. క్షణాల్లోనే..
Swimming Pool Accident

మహారాష్ట్ర: సింధుదుర్గ్ జిల్లాలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. కొంతమంది యువకుల విహారయాత్ర విషాదాంతంగా ముగిసింది. కొల్హాపూర్ జిల్లాకు చెందిన శ్రేణిక్ మిలింద్ తకాలే తన తొమ్మిది మంది స్నేహితులతో కలిసి జూన్ 20న మాల్వాన్‌లోని వయారిలో ఉన్న ఓ రిసార్ట్‌కు వెళ్లాడు. అక్కడ సరదాగా గడిపేందుకు స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు దిగాడు. అంతా సరదాగా ఈత కొడుతూ సందడి చేయడం మొదలుపెట్టారు. డ్యాన్సులు చేస్తూ కేరింతలు కొడుతుండగా.. ఓ యువకుడు వారిని వీడియో తీస్తున్నాడు. అయితే, వారి సంతోషం నిమిషాల్లోనే విషాదంగా మారింది.


కొంతమంది యువకులు కొలనులో ఉండగా మిలింద్ తకాలే, మరో స్నేహితుడు స్విమ్మింగ్ పూల్ బయట ఉన్న రెండు ఎత్తైన గోడలపైకి ఎక్కారు. వాటిపై నిలబడి డ్యాన్సులు చేయడం ప్రారంభించారు. అనంతరం సుమారు 10 అడుగుల ఎత్తైన ఆ గోడ పైనుంచి తకాలే డైవ్ చేసి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకాడు. చిన్నపిల్లల కోసం ఉద్దేశించిన కొలను కావడంతో నాలుగు అడుగుల లోతు మాత్రమే ఉంది. కొలను లోతు తక్కువగా ఉండటంతో, అంత ఎత్తు నుంచి దూకిన తకాలే తల స్విమ్మింగ్ పూల్ అడుగుభాగాన్ని బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలు కావడంతో అతడు నీటిలోనే అపస్మారక స్థితిలో పడిపోయాడు.


ఇది గమనించని మిగతా స్నేహితులు డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు. కొద్దిసేపటికి తేరుకుని తకాలే పరిస్థితిని గమనించారు. వెంటనే అతడిని బయటకు తీసి హుటాహుటిన మాల్వాన్ గ్రామీణ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే తకాలే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ రైజింగ్ విజన్‌కు ప్రపంచ దిగ్గజ కంపెనీల మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి

సీషెల్స్ పర్యటనలో గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ

Updated Date - Jun 29 , 2026 | 07:53 AM