విమానం టికెట్ రేట్లు ఎక్కువని రైలెక్కాడు.. చివరికి అతడికి ఊహించని షాక్..
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:39 PM
పండుగ సీజన్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బస్సు, రైళ్లతోపాటు విమాన ఛార్జీలను భారీగా పెంచేస్తున్నారు. ఈ దీపావళికి కూడా ఛార్జీలు భారీగా పెంచేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పండుగ సీజన్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బస్సు, రైళ్లతోపాటు విమాన ఛార్జీలను భారీగా పెంచేస్తున్నారు. ఈ దీపావళికి కూడా ఛార్జీలు భారీగా పెంచేశారు. ఈ నేపథ్యంలో డబ్బులు ఆదా చేసుకునేందుకు విమానానికి బదులుగా రైలులో ప్రయాణించాలని ఓ కంపెనీకి చెందిన సీఈవో అయిన వైభవ్ జైన్ అనే వ్యక్తి నిర్ణయించుకున్నాడు. అయితే తాను తీసుకున్న ఈ నిర్ణయానికి చింతిస్తున్నానని ఆయన వెల్లడించాడు.
ఈ సారి దీపావళి వేడుకలు తన సొంతూరు లక్నోలో జరుపుకోవాలని సదరు వ్యక్తి భావించాడు. అయితే విమాన టికెట్ ధరలు భారీగా ఉండడంతో.. ఇండోర్ నుంచి లక్నోకు తన ఫ్యామిలీతో మహాకాల్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. అయితే ఈ రైలు ఇండోర్ నుంచి లక్నోకు దాదాపు 7.5 గంటలు ఆలస్యంగా నడుస్తుందని తెలిసింది. దీంతో షాక్ అయిన ఆ వ్యక్తి రైల్లో ఉండగానే తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని వివరిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. తాము లక్నోకు చేరుకోవడానికి 14 గంటలు పడుతుందని.. రైలు 8 గంటలు ఆలస్యంగా నడుస్తొందని అన్నాడు. రైల్లో వెళ్లాలని తాను తీసుకున్న నిర్ణయానికి చింతిస్తున్నట్లు వెల్లడించాడు. ఇలా రైలులో ప్రయాణించాలని తాను తీసుకున్న నిర్ణయం వెనుక మరో కారణం కూడా ఉందని వివరించాడు. రైలు ప్రయాణం తన రెండేళ్ల కుమార్తెకు మంచి అనుభూతిని ఇస్తుందని భావించానని చెప్పాడు.
వైభవ్ జైన్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అతడికి మద్దతుగా కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు రైలు ఆలస్యం అనేది సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్య అని కామెంట్లు చేస్తున్నారు.