కామాంధుడి అసభ్య ప్రవర్తన.. చితక్కొట్టిన యువతి.. వైరల్ వీడియో..
ABN , Publish Date - Jul 13 , 2026 | 03:54 PM
దేశవ్యాప్తంగా రోజూ ఏదో ఒక చోట మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు కామాంధులు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, బాధిత యువతి చూపిన తెగువ నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది.
మధ్యప్రదేశ్: దేశవ్యాప్తంగా రోజూ ఏదో ఒక చోట మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు కామాంధులు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లు, సినిమాహాళ్లు సహా ఎక్కడా వారికి రక్షణ దొరకడం లేదు. ఆడవాళ్లు కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. తమ కామవాంఛలు తీర్చుకునేందుకు నిత్యం ఆరాటపడుతున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, బాధిత యువతి చూపిన తెగువ నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది.
సాగర్ జిల్లా డియోరి బస్టాండ్‌లో ఓ బస్సు నిలిచి ఉంది. కొంతమంది ప్రయాణికులు బస్సు ఎక్కుతుండగా, మరికొందరు దిగుతున్నారు. అయితే, బస్సు చివరన కూర్చున్న ఓ యువకుడు నడుచుకుంటూ ముందు వైపునకు వచ్చాడు. ఇద్దరు యువతులు కూర్చున్న సీటు పక్కన నిలబడ్డాడు. ఇద్దరిలో ఓ యువతికి దగ్గరగా ఆనుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తన ప్యాంట్ జిప్ తీసి వికృతంగా ప్రవర్తించాడు. తన మర్మాంగాన్ని ఆమె భుజానికి తగిలించేలా నీచానికి దిగజారాడు. బాధితురాలి పక్కన కూర్చున్న యువతి దీనిని గమనించి వెంటనే తన స్నేహితురాలిని అప్రమత్తం చేసింది. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన యువతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపై వెంటనే తేరుకుని కామాంధుడి భరతం పట్టింది. అతని చెంప పగిలేలా కొట్టింది. అనుకోని షాక్ తగలడంతో నిందితుడు బస్సు దిగి పరారయ్యాడు. అతన్ని పట్టుకునేందుకు ఆ ఇద్దరు యువతులూ బస్సు దిగి వెళ్లారు. దీంతో బస్సులోని ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఈ ఘటన మొత్తం బస్సులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డియోరి పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, బాధితురాలి నుంచి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందకపోవడంతో ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. మరోవైపు, కామాంధుడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్, ప్రైవేటు ప్రాంతాల్లో మహిళలను వేధించే వారికి కఠిన శిక్షలు పడాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, యువతి చూపిన ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది భయంతో కామాంధుల చేష్టలను భరిస్తారని, అయితే ఈ యువతి మాత్రం ధైర్యంగా ఎదురు తిరిగి బుద్ధి చెప్పిందని ప్రశంసిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కదులుతున్న రైలులో పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ వివరణ..
వయసు సంఖ్య మాత్రమే.. 80 ఏళ్ల వయసులో వృద్ధురాలి సాహసం..