Share News

150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి చేరిన పుస్తకం.. జరిమానా లెక్క చూస్తే..

ABN , Publish Date - Aug 01 , 2026 | 11:17 AM

ఆస్ట్రేలియాలో ఓ పబ్లిక్ లైబ్రరీకి చెందిన ఓ పుస్తకం దాదాపు 150 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది. అయితే ఆ పుస్తకం బయటపడడం సాధారణంగా జరగలేదు.

150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి చేరిన పుస్తకం.. జరిమానా లెక్క చూస్తే..
Australia library book

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో ఓ పబ్లిక్ లైబ్రరీకి చెందిన ఓ పుస్తకం దాదాపు 150 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది. అయితే ఆ పుస్తకం బయటపడడం సాధారణంగా జరగలేదు. గతంలో మూసివేసిన పొయ్యి గోడ (Fire place)ను ఇంటి పునర్నిర్మాణం కోసం తెరిచినపుడు అందులో దాచిన చెక్క పెట్టెలో ఈ పుస్తకం బయటపడింది. దీంతో ఈ అరుదైన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది (150 years overdue book).


ఈ పుస్తకం పేరు 'యాంటిక్విటీస్ ఆఫ్ ఏథెన్స్' (Antiquities of Athens). ఇది 1858లో ప్రచురితమైంది. ఆస్ట్రేలియాలోని కియామా లైబ్రరీ 1872లో ప్రారంభమైన కొద్ది కాలానికే ఈ పుస్తకాన్ని ఎవరో తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత అది తిరిగి లైబ్రరీకి చేరలేదు. ఇటీవల ఇంటి పునర్నిర్మాణ పనుల్లో గోడలోని టీ పెట్టెలో ఈ పుస్తకం కనిపించడంతో దాన్ని లైబ్రరీకి అప్పగించారు.


1870ల కాలంలోని లైబ్రరీ నిబంధనల ప్రకారం, పుస్తకాన్ని ఆలస్యంగా తిరిగి ఇస్తే వారానికి మూడు పెన్స్ జరిమానా ఉండేది. అదే లెక్కను ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మార్చితే, ఈ పుస్తకంపై పడే జరిమానా సుమారు 28,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు రూ.19 లక్షలు) అవుతుందని లైబ్రరీ అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం లైబ్రరీలో ఆలస్య రుసుము విధానం లేకపోవడంతో ఎలాంటి జరిమానా వసూలు చేయలేదు (Australia library book).


1870ల నాటి రికార్డులు అందుబాటులో లేకపోవడంతో చివరిగా ఈ పుస్తకాన్ని ఎవరు తీసుకెళ్లారో నిర్ధారించడం సాధ్యం కాలేదని లైబ్రరీ అధికారి తెలిపారు. కాగా, దాదాపు శతాబ్దంన్నర పాటు గోడలో దాగి ఉన్నప్పటికీ, పుస్తకం చాలా వరకు బాగానే ఉండడం గమనార్హం. ఇకపై దీనిని సాధారణ పాఠకులకు ఇవ్వకుండా, కియామా లైబ్రరీ చారిత్రక సేకరణలో ప్రత్యేక ప్రదర్శనగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు.


ఇవి కూడా చదవండి..

చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. శాస్త్రవేత్తలలో ఉత్కంఠ..


పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 01 , 2026 | 11:25 AM