Share News

అమెరికా పోలీసు కాల్పులు.. పెంపుడు కుక్క మరణం.. షాకింగ్ వీడియో

ABN , Publish Date - Jun 21 , 2026 | 03:36 PM

తమపై దూసుకొచ్చిన ఒక మహిళ పెంపుడు కుక్కపై లాస్ ఏంజెలెస్ పోలీసు అధికారి ఒకరు తుపాకీతో కాల్పులు జరపడంతో శునకం అక్కడిక్కడే మరణించింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానిక పోలీస్ డిపార్ట్‌మెంట్ తాజాగా విడుదల చేసింది.

అమెరికా పోలీసు కాల్పులు.. పెంపుడు కుక్క మరణం.. షాకింగ్ వీడియో
Pet Dog Shot in LA

ఇంటర్నెట్ డెస్క్: లాస్ ఏంజెలెస్ (యూఎస్ఏ) పోలీసు అధికారి ఒక మహిళ పెంపుడు కుక్కపై కాల్పులు జరపడడంతో అది అక్కడిక్కడే మరణించింది. జూన్ 13న ఈ ఘటన జరగ్గా ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని పోలీసులు తాజాగా విడుదల చేశారు. ఈ ఉదంతంపై ప్రస్తుతం అమెరికాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఎవరో మహిళ తన ఇంట్లో పెద్ద పెట్టున కేకలు పెడుతోందన్న సమాచారం అందడంతో ఆరా తీసేందుకు ఇద్దరు పోలీసులు వెళ్లారు. అయితే, మహిళ క్షేమంగానే ఉన్నట్టు తెలిసింది. ఎన్‌బీఏ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో చాలా కాలం తరువాత తన ఫేవరెట్ జట్టు గెలవడంతో మహిళ పెద్ద పెట్టున కేకలు పెడుతూ సంబరపడ్డట్టు పోలీసులు గుర్తించారు. మహిళతో మాట్లాడుతుండగా ఆమె పెంపుడు కుక్క బయటకు వచ్చి పోలీసులపై మొరగడం ప్రారంభించింది. దీంతో కుక్కను లోపల పెట్టాలని వారు ఆమెకు చెప్పారు.


వారి సూచన మేరకు శునకాన్ని లోపల గదిలో పెట్టి ఆమె తిరిగొచ్చింది. తరువాత పోలీసులతో ఆమె మాట్లాడుతుండగా కుక్క మళ్లీ బయటకు వచ్చి ఒక పోలీసు వైపు పరిగెత్తింది. ఈ క్రమంలో ఒక అధికారి కుక్కపై ఏకంగా నాలుగు సార్లు కాల్పులు జరిపారు. దీంతో శునకం అక్కడిక్కడే మరణించింది. వద్దు వద్దు అంటూ మహిళ వారిస్తుండగానే అనర్థం జరిగిపోయింది. తొలుత కుక్కను చూసిన పోలీసులు అది చాలా పెద్దగా ఉందని కామెంట్ చేశారు. దాని బారిన పడే ప్రసక్తేలేదని అన్నారు. ఇదంతా వారి యూనిఫామ్‌కు అమర్చిన కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఫుటేజీని పోలీసులు తాజాగా రిలీజ్ చేశారు.


ఇక ఘటనపై విమర్శలు వ్యక్తం అవుతుండటంతో పోలీసులు ఎక్స్ వేదికగా స్పందించారు. బాధిత మహిళకు క్షమాపణ చెప్పారు. పెంపుడు కుక్కలంటే కేవలం జంతువులు కాదని, అనేక మంది వాటిని తమ కుటుంబసభ్యులుగా భావిస్తారని అన్నారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. నిష్ఫాక్షిక దర్యాప్తు అనంతరం తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

వామ్మో.. సమోసాలకు రంగులేస్తున్నారా.. వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనా..

కాకులకు పనికి ఆహారం

Updated Date - Jun 21 , 2026 | 03:40 PM