16 ఏళ్లకే సీఏ.. భారతీయ టీనేజర్ గిన్నిస్ రికార్డు
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:00 PM
పదహారేళ్ల వయసులోనే ఓ భారతీయ టీనేజర్ సీఏగా గుర్తింపు పొంది గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.
ఇంటర్నెట్ డెస్క్: పదహారేళ్ల వయసులో టీనేజర్లు తాము ఏ రంగాన్ని ఎంచుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతుంటారు. కానీ ఓ భారతీయ టీనేజర్ మాత్రం తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవడమే కాకుండా అందులో గిన్నిస్ రికార్డు కూడా సృష్టించాడు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న లక్ష్మణన్ మేయప్పన్ అత్యంత పిన్నవయస్కుడైన సీఏగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తాజాగా చోటు సంపాదించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడికీ అరుదైన గుర్తింపు లభించింది. ప్రస్తుతం మేయప్పన్ సెంచరీ ఫైనాన్షియల్ అనే సంస్థలో సీనియర్ ఫైనాన్షియల్ రీసెర్చ్ ఎనలిస్టుగా ఉన్నాడు. అతడి అసాధారణ ప్రజ్ఞ గురించి కంపెనీ స్వయంగా ప్రకటించింది.
కొవిడ్ సమయంలో అకౌంటింగ్‌పై మేయప్పన్‌కు మక్కువ ఏర్పడింది. స్వయంగా సీఏ అయిన అతడి తల్లి అకౌంటింగ్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలను తనయుడికి పరిచయం చేయడంతో ఆసక్తి ఏర్పడింది. దీంతో, తాను ఏసీసీఏ పరీక్షలు పాసై సీఏ కావాలని నిర్ణయించుకున్నాడు. 10వ తరగతి పరీక్షల తరువాత ఏడాది పాటు కష్టపడి 2021లో ఏసీసీఏ (అసోసియేషన్ ఆఫ్ చార్టెడ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. కేవలం 16 ఏళ్ల 141 రోజులు చిరు ప్రాయంలోనే చార్టెడ్ అకౌంటెంట్‌గా మారాడు.
తనకు గిన్సిస్ రికార్డుల్లో చోటు దక్కడంపై మేయప్పన్ హర్షం వ్యక్తం చేశాడు. ‘ఇది నాకెంతో విలువైనది. చదువు అనేది నేనెప్పుడు ఒక రేసులా భావించలేదు. ఆర్థికరంగాన్ని అర్థం చేసుకునేందుకే ప్రాథాన్యం ఇచ్చాను. అన్ని కాలాలకు అనువైన నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టిపెట్టాను. ఆసక్తితో ఏదైనా నేర్చుకుంటే ఫలితాలు అర్థవంతంగా ఉంటాయి’ అని అన్నాడు. భారత్‌లో సీఏ పరీక్షలకు హాజరయ్యేందుకు కనీసం 12వ తరగతి పాసై ఉండాల్సిన విషయం తెలిసిందే. అయితే, బ్రిటన్‌కు చెందిన అసోసియేషన్ ఆఫ్ చార్టెడ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ (ఏసీసీఏ) పరీక్షకు హాజరయ్యేందుకు కనీస విద్యార్హత 10వ తరగతే. ఏసీసీఏకు మొత్తం 180 దేశాల్లో గుర్తింపు ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
విమానం టేకాఫ్ అవుతుండగా దూసుకొచ్చిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే!
ఢిల్లీ మెట్రోలో మహిళ ఫొటోలు తీసిన సీఐఎస్ఎఫ్ జవాన్.. వీడియో వైరల్..