పరిగెత్తండి.. తినండి.. పరిగెత్తండి.. విశ్వవిద్యాలయంలో వినూత్న ఛాలెంజ్
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:32 AM
కొంత మంది స్నేహితుల మధ్య సరదాగా ఓ ఛాలెంజ్ ప్రారంభమైంది. వీకెండ్‌లో జరుపుకునే ఓ చిన్న కార్యక్రమంగా మొదలైంది. నేడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అదే క్రిప్సీ క్రీమ్ ఛాలెంజ్.
ఇంటర్నెట్ డెస్క్: 4 కిలోమీటర్లు పరిగెత్తాలి. నిర్దేశించిన లక్ష్యం వద్ద 12 డోనట్స్ తినాలి. మళ్లీ 4 కిలోమీటర్లు వెనక్కి పరిగెత్తుకొంటూ రావాలి. మొత్తం 8 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఇదంతా గంట వ్యవధిలో జరిగిపోవాలి. ప్రతి ఏటా నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీలో క్రిస్పీ క్రీమ్ ఛాలెంజ్ పేరిట ఈ పందెం నిర్వహిస్తారు. ఈ ఏడాది నిర్వహించిన ఈ పందెంలో ఆరు వేల మంది విద్యార్థులు, యువత పాల్గొన్నారు. దీని ద్వారా 160,000 డాలర్ల నిధులు వచ్చాయి. ఈ నిధులను యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా చిల్డ్రన్ హాస్పటల్‌లో చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం వినియోగిస్తారు. చలిని సైతం లెక్క చేయకుండా ఈ పందెంలో పాల్గొంటారు.

ఈ పందెంలో పాల్గొనడం అంత సులభమేమి కాదు. కానీ ప్రతి ఏడాది దీనిలో పాల్గొనే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఇందులో పాల్గొనేందుకు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు, యువత ఆసక్తి చూపడానికి ప్రత్యేక కారణం ఉందని అంటారు. ఈ పందెంలో నియమ నిబంధనలు సూటిగా స్పష్టంగా ఉండడమే కారణమని చెబుతారు. ఈ పందెంలో పాల్గొనే వారు.. బెల్ టవర్ నుంచి క్రిస్పీ క్రీమ్ అవుట్‌లెట్ వరకు 4 కిలోమీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత.. వారు 12 డోనట్‌లను తినాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రారంభించిన స్థానానికి మళ్లీ వేగంగా పరిగెత్తుకుని రావాల్సి ఉంటుంది. ఇదంతా జస్ట్ 60 నిమిషాల్లో చకచకా జరిగిపోవాలి.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. 2004లో కొంత మంది స్నేహితుల మధ్య సరదాగా ఈ ఛాలెంజ్ ప్రారంభమైంది. వీకెండ్‌లో జరుపుకునే ఓ చిన్న కార్యక్రమంగా ఈ క్రిప్సీ క్రీమ్ ఛాలెంజ్ ప్రారంభమై.. నేడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అత్యధిక ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా మారింది. ఈ పందెం ప్రారంభమైన నాటి నుంటి ఈ ఏడాది వరకు మొత్తం 2.4 మిలియన్ డాలర్లు నిధులుగా సమకూరాయి. కొంత మంది విద్యార్థుల ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 22 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..
రోబో రివర్స్ అయితే ఎలా ఉంటుందో తెలుసా..? వీడియో వైరల్..
చావు అంచుల వరకు వెళ్లి తిరిగొచ్చాడు.. షాకింగ్ వీడియో వైరల్..