కొడైకెనాల్లో ఆకస్మిక వరదలు.. గంటల పాటు నిలిచిన వాహనాలు.. వీడియో వైరల్
ABN , Publish Date - Oct 24 , 2026 | 02:48 PM
తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్లో భారీ వర్షం కారణంగా ఆకస్మిక వరదలు కలకలం సృష్టించాయి. సిల్వర్ క్యాస్కేడ్ జలపాతం సమీపంలో కొండవాలుల నుంచి బురద నీరు ఒక్కసారిగా రోడ్డుపైకి ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి..
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని కొడైకెనాల్లో సిల్వర్ క్యాస్కేడ్ జలపాతం సమీపంలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండవాలుల నుంచి బురద నీరు ఒక్కసారిగా ఉప్పొంగి రహదారిపైకి ప్రవహించడంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కార్లు, బస్సులు ముందుకు కదల్లేకపోయాయి. దాదాపు రెండు గంటలకు పైగా వాహనాలు నిలిచిపోయినట్లు సమాచారం. రహదారిపైకి వరద నీరు పోటెత్తుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కొడైకనాల్కు వెళ్లే పర్యాటకులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలనే సూచనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రయాణాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
మరోవైపు.. తమిళనాడు వ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాలు బలపడుతున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్టోబర్ 26 వరకు పలు ప్రాంతాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసినట్లు సమాచారం. చెన్నైలోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. అక్టోబర్ 25 నుంచి వర్షపాతం మరింత పెరగవచ్చని అంచనా. ఇప్పటికే అక్టోబర్ నెలలో తమిళనాడులో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో కొండ ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు ప్రయాణానికి ముందు వాతావరణ హెచ్చరికలు.. రహదారుల పరిస్థితులను తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల సమయంలో ఉధృతంగా ప్రవహించే నీటిని దాటేందుకు ప్రయత్నించకుండా.. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బొత్స చైతన్యపై జనసేన ఫిర్యాదు.. జెడ్పీటీసీ నామినేషన్‌పై అభ్యంతరం
స్థానిక ఎన్నికలను ఆపేందుకు 59 పిటిషన్లు.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
Read Latest AP News And Telugu News