Share News

రష్యా అధ్యక్షుడితో సెల్ఫీ! భారతీయ టీనేజర్‌కు అరుదైన ఛాన్స్

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:47 PM

కేరళకు చెందిన టీనేజ్ ఆంత్రప్రెన్యూర్ రావుల్ జాన్ అజూకు ఇటీవల అరుదైన అవకాశం దక్కింది. మాస్కోలో ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్నేషనల్ ఏఐ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జా‌న్‌కు ఏకంగా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి సెల్ఫీ దిగే అవకాశం దక్కింది

రష్యా అధ్యక్షుడితో సెల్ఫీ! భారతీయ టీనేజర్‌కు అరుదైన ఛాన్స్
Raul John Aju Selfie with putin

ఇంటర్నెట్ డెస్క్: కేరళకు చెందిన టీనేజ్ ఆంత్రప్రెన్యూర్ రావుల్ జాన్ అజూకు ఇటీవల అరుదైన అవకాశం దక్కింది. మాస్కోలో ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్నేషనల్ ఏఐ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జా‌న్‌కు ఏకంగా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి సెల్ఫీ దిగే అవకాశం దక్కింది. ఆ సెల్ఫీని జాన్ స్వయంగా నెట్టింట పంచుకుని ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఇలాంటి ఓ రోజు ఉంటుందని తాను కలలో కూడా అనుకోలేదని సంబరపడ్డాడు. మూడు రోజుల పాటు జరిగే ఈ కాన్ఫరెన్స్ నవంబర్ 26న మొదలైంది.


ఎవరీ ఈ ఏఐ కిడ్‌?

జాన్‌కు చాలా చిన్నప్పుడే కంప్యూటర్ల ప్రపంచంతో పరిచయమైంది. ప్రస్తుతం అతడు తను డిజైన్ చేసిన రకరకాల ఏఐ టూల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా పాప్యులారిటీ సాధించాడు. ఏఐ కిడ్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందాడు. 15 మంది ఉద్యోగులతో అతడు ఓ ఏఐ స్టార్టప్ సంస్థను కూడా నిర్వహిస్తున్నాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జాన్ తండ్రి కూడా తన బిడ్డ సంస్థలోనే పని చేస్తూ నెలకు రూ.2 లక్షల జీతం తీసుకుంటున్నారు.

9 ఏళ్ల వయసులోనే జాన్ తనంతట తానుగా ఏఐని నేర్చుకున్నాడు. ఆ తరువాత ఏఐ రీలమ్ టెక్నాలజీస్ పేరిట ఓ స్టార్టప్ సంస్థను ప్రారంభించాడు. ప్రస్తుతం 15 మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇచ్చింది.


‘వీడియో ఎడిటింగ్ ద్వారా నాకు ఏఐ టెక్నాలజీ గురించి తెలిసింది. అప్పట్లో మా నాన్నకు ఎడోబీలో జాబ్ వచ్చింది. దీంతో, నాకు ఎడోబీ ప్రీమియం టూల్స్ అకౌంట్స్ అన్నీ అందుబాటులోకి వచ్చాయి. అలా ఏఐ గురించి తెలిసింది. దాని సాయంతో నేను మీబాట్ అనే ఓ రోబోను కూడా డిజైన్ చేశాను’ అని చెప్పాడు. ఇక మాస్కోలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్ఠాత్మక కాన్ఫరెన్స్‌లో భారత్‌తో పాటు సెర్బియా, బ్రెజిల్, కెన్యా, కజకస్థాన్, యూఏఈ దేశాల వారు పాల్గొంటున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

భారతీయుడి ప్రపంచ రికార్డు.. 10 లక్షల మంది యూట్యూబ్ పెయిడ్ ఛానల్ మెంబర్స్..

ప్రశ్నలు మీవే.. సమాధానాలూ మీవే.. ఐఐటీలో ఇలాంటి పరీక్షలా?

Updated Date - Nov 27 , 2026 | 12:51 PM