Share News

రహదారిపై కారు ఆపి నిద్రపోయాడు.. కారణం తెలిస్తే అవాక్కవాల్సిందే.. వీడియో వైరల్

ABN , Publish Date - Sep 02 , 2026 | 08:25 AM

రహదారిపై ఏదో కారణం చేత ఓ వాహనం ఆగిపోతే.. ఆ వెనుక వందలాది వాహనాలు నిలిచిపోతాయి. దీంతో ట్రాఫిక్ కష్టాలు మొదలవుతాయి. అదే మహానగరంలో అయితే.. వాహనదారులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది.

రహదారిపై కారు ఆపి నిద్రపోయాడు.. కారణం తెలిస్తే అవాక్కవాల్సిందే.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: రహదారిపై ఏదో కారణం చేత ఓ వాహనం ఆగిపోతే.. ఆ వెనుక వందలాది వాహనాలు నిలిచిపోతాయి. దీంతో ట్రాఫిక్ కష్టాలు మొదలవుతాయి. అదే మహానగరంలో అయితే.. వాహనదారులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇలాంటి పరిస్థితులు నిత్యం చూస్తునే ఉంటాం. రహదారి మధ్యలో కారును నిలిపి.. డ్రైవర్ నిద్రపోయాడు. దీంతో అతడిని నిద్ర లేపుతున్నారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.


కేరళలోని ఎట్టుమానూర్- అదిరంపుళా రహదారిపై ఓ వ్యక్తి.. తన వాహనాన్ని రహదారి మధ్యలో నిలిపి కారులోనే నిద్రపోయాడు. ఈ విషయాన్ని వాహనదారులతోపాటు స్థానికులు గుర్తించారు. అతడిని నిద్ర లేపేందుకు వారంతా ప్రయత్నించారు. కారును వారంతా బలంగా కదిలించారు. కారు అద్దాలను కొట్టారు. అయినా డ్రైవర్‌లో చలనం లేదు. దీంతో కంగారు పడిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కొంత సేపటి తర్వాత స్థానికులతోపాటు పోలీసులు కారు డ్రైవర్‌ను నిద్ర లేపారు. అనంతరం అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష జరిపారు. దీంతో అతడు ఫుల్‌గా మద్యం సేవించినట్లు నిర్ధారించారు. మద్యం మత్తుతోనే అతడు కారులో నిద్రపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఈ వీడియోను @jinx_5182 ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మద్యం తాగి వాహనం నడపడానికి ప్రయత్నించకుండా.. ఆ వ్యక్తి కారును ఆపడం పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారి మధ్యలో కారు ఎలా నిలుపుతారని ఇంకొందరు ప్రశ్నించారు. మద్యం మత్తులో వాహనం నడిపి.. యాక్సిడెంట్ చేసే కంటే అతడు ఇలా చేయడం చాలా కరెక్ట్ అని ఇంకొందరు కామెంట్ చేశారు.

Updated Date - Sep 02 , 2026 | 12:53 PM