పరిహారం చెల్లించాల్సిందే! మ్యారేజ్ బ్యూరోకు వినియోగదారుల కమిషన్ ఆదేశం
ABN , Publish Date - Jul 16 , 2026 | 06:56 PM
పెళ్లి సంబంధం వెతికిపెడతామని కస్టమర్‌కు మాటిచ్చి విఫలమైన మ్యారేజ్ బ్యూరో పరిహారం చెల్లించాలని కేరళలోని వినియోగదారుల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: తగిన పెళ్లి సంబంధం వెతికిపెడతామని కస్టమర్‌కు మాటిచ్చి విఫలమైన మ్యారేజ్ బ్యూరో పరిహారం చెల్లించాలని కేరళలోని వినియోగదారుల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తగిన సంబంధం చూపెడతామంటూ తొమ్మిదేళ్ల పాటు హామీలు ఇచ్చి విఫలమైనందుకు ఈ పరిహారం చెల్లించాలని పేర్కొంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, కన్నూర్‌లోని ఒక నర్సింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేస్తున్న వ్యక్తి 2016లో తనకు పెళ్లి సంబంధాల కోసం శ్రీచక్ర మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించారు. కాసర్‌గోడ్‌లో ఒక సంబంధం ఉందని చెప్పిన మ్యారేజ్ బ్యూరో ఆ విషయాన్ని అక్కడితో పక్కన పెట్టేసింది. ఆ తరువాత వ్యక్తికి తగిన సంబంధాలు చూపించడంలో విఫలమైంది. మ్యారేజ్ బ్యూరో వద్ద తన ప్రొఫైల్ ఎలాంటి వ్యాలిడిటీ లేకుండా ఇంతకాలం యాక్టివ్‌గానే ఉందని కస్టమర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తగిన సంబంధం చూపిస్తామంటూ ఏటా మ్యారేజీ బ్యూరో హామీ ఇస్తూ వచ్చిందని చెప్పారు.
తన పెళ్లి కోసం ఎదురుచూస్తూనే తండ్రి 2025లో మరణించారని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న తల్లి ఇప్పటికీ తన వివాహంపై ఎన్నో ఆశలు పెట్టుకుందని అన్నారు. మ్యారేజ్ బ్యూరో తీరు వల్ల తనకు మానసిక వేదన కలిగిందని, ఆర్థికంగా నష్టపోయానని చెప్పారు. ఇదిలా ఉంటే, ఫిర్యాదుదారుడి నోటీసులకు మ్యారేజ్ బ్యూరో స్పందించలేదు. కమిషన్ ముందు కూడా హాజరుకాలేదు. లిఖితపూర్వంగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో, ఎక్స్ పార్టీగా ఈ కేసులో విచారణ జరిగింది.
ఈ ఉదంతంలో మ్యారేజీ బ్యూరో సేవాలోపం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. బాధితుడి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పేరిట తీసుకున్న రూ.3 వేలు తిరిగిచ్చేయడంతో పాటు ఆయనకు మానసిక వేదన కలిగించినందుకు మరో రూ.3 వేల పరిహారం, లిటిగేషన్ ఖర్చుల కింద రూ.2 వేలు ఇవ్వాలని మ్యారేజీ బ్యూరోను ఆదేశించింది. ఈ తీర్పును ఉల్లంఘించిన పక్షంలో ఏటా 9 శాతం చొప్పున వడ్డీ కూడా అదనంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్ నేవీ జెట్స్ విన్యాసం.. బీచ్‌లో గాల్లోకి ఎగిరిన టెంట్లు, కుర్చీలు
భారత సంతతి బాలిక ఘనత.. యూఎస్ నేవీ క్యాడెట్స్‌కు నాయకత్వం వహించే ఛాన్స్