Share News

గన్నుతో ధురంధర్ పాటకు డ్యాన్స్.. చిక్కుల్లో కాంగ్రెస్ నాయకుడు..

ABN , Publish Date - Feb 11 , 2026 | 11:19 AM

కర్ణాటక రాష్ట్రంలోని అఫ్జల్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్‌వై పాటిల్ అనుచరుడైన మతీన్ పాటిల్.. ధురంధర్ పాటకు గన్నుతో డ్యాన్స్ చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిక్కుల్లోపడ్డారు. ఈ ఘటనపై పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

గన్నుతో ధురంధర్ పాటకు డ్యాన్స్.. చిక్కుల్లో కాంగ్రెస్ నాయకుడు..
Karnataka Congress leader viral reel

బెంగళూరు, ఫిబ్రవరి 11: డ్యాన్స్ రీల్ ఓ కాంగ్రెస్ నాయకుడి కొంపముంచింది. ధురంధర్ పాటకు గన్నుతో ఆయన డ్యాన్స్ చేసిన రీల్.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిక్కుల్లోపడ్డారు. ఇంతకీ సంగతేంటంటే.. కర్ణాటక రాష్ట్రంలోని అఫ్జల్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్‌వై పాటిల్ అనుచరుడైన మతీన్ పాటిల్.. ఇటీవల జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. ఫంక్షన్ జరుగుతున్న ప్రాంతంలోకి మతీన్ సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ధురంధర్ సినిమాలోని ‘Fa9la’ పాట ప్లే అవుతూ ఉంది. కారులో వచ్చిన ఆయనకు అక్కడి వారు ఘన స్వాగతం పలికారు.


ఆయన నేరుగా స్టేజి మీదకు వచ్చారు. వచ్చీ రాగానే గన్ను చేతిలో పట్టుకుని ధురంధర్ పాటకు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన 43 సెకన్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.


కలబురగి పోలీస్ కమిషనర్ శరణప్ప ఎస్‌డీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఓ వ్యక్తి గన్ను చేతిలో పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఎక్కడ తీశారు? ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలుసుకోమని అధికారులను ఆదేశించాను. ఆ గన్ను నిజమైనదా లేక నకిలీదా తెలుసుకోమన్నాను. అది నిజమైనదైతే.. దానికి లైసెన్స్ ఉందా? లేదా? చెక్ చేస్తాం. లైసెన్స్ ఉంటే.. ఆయన రూల్స్ అతిక్రమించాడా? లేదా? అని చెక్ చేస్తాం. నిబంధనలు ఉల్లంఘించాడని తేలితే ఆయుధాల చట్టం కింద చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. ఎమ్మెల్యే అనుచరుడు గన్నుతో డ్యాన్స్ చేసిన ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. మార్చి 9వ తేదీన చర్చ..

ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్.. 11 నిమిషాల్లోనే మాజీ సీఎం జగన్ బయటకు..

Updated Date - Feb 11 , 2026 | 11:35 AM