రైల్లో దారుణం.. బ్లేడ్‌తో సీట్లను కోసేసిన అగంతకులు
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:41 PM
కమలా గంగా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో కొందరు అగంతకులు సీట్లను బ్లేడ్స్‌తో కోసేశారు. ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కమలా గంగా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్(Kamla Ganga Intercity Express)లో కొందరు అగంతకులు సీట్లను బ్లేడ్‌తో కోసి ధ్వంసం చేసిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. రైల్లోని ఓ ప్యాసెంజర్ ఈ దృశ్యాలు చూసి షాకైపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సీట్ల కవర్లను కావాలనే కోసినట్టు వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. అగంతకుల చర్యలతో పలు సీట్లు దెబ్బతిన్నాయి. సీట్లపై కవర్లు చిరిగిపోవడంతో లోపలి కుషన్, మెటల్ ఫ్రేమ్స్ బయటకు కనిపించాయి. యావత్ బోగీలోని సీట్లన్నిటినీ పాడుచేశారని ప్యాసెంజర్ ఒకరు ఆరోపించారు (Seats Slashed, Vandalism). ‘సీట్లను బ్లేడ్స్‌తో కోసేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి రాక్షసానందం పొందారు’ అని వీడియో షేర్ చేసిన వ్యక్తి కామెంట్ చేశారు.
ఇక ఈ వీడియోపై (Viral Video) నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. బోగీల్లో నిఘాను మరింత పటిష్ఠ పరచాలని నెటిజన్లు సూచించారు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అన్నారు. జరిగిన నష్టాన్ని వారితోనే భర్తీ చేయించాలనీ డిమాండ్ చేశారు. బోగీల్లోపల కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి ఘటనలు జరగవని అన్నారు. దేశంలో నిబంధనల అమలు సరిగా లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వారికి రైల్వే యాక్ట్- 1989 ప్రకారం, ఐదేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది. తీవ్రమైన నేరాల్లో కోర్టులు యావజ్జీవ శిక్ష కూడా విధించే ఛాన్స్ ఉంది.
ఇవీ చదవండి:
ప్రాణాలతో చెలగాటం వద్దు.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్
డెలివరీ ఏజెంట్ కష్టాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో