Share News

ప్రాణాలతో చెలగాటం వద్దు.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:53 PM

రైలు పట్టాల మధ్యలో బోర్లా పడుకుని ప్రమాదకర స్టంట్ చేసిన ఓ యువకుడి వీడియోను హైదరాబాద్ సీపీ సజ్జనార్ షేర్ చేశారు. యువకుడి తీరు మూర్ఖత్వానికి పరాకాష్ట అని అన్నారు. ఇలాంటి స్టంట్స్ వద్దని హెచ్చరించారు.

ప్రాణాలతో చెలగాటం వద్దు.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్
Sajjanar Shares Viral Video

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం పాకులాడుతున్న నేటి యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్నామనే విషయాన్ని కూడా గుర్తించలేకపోతోంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు నెట్టింట కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అయితే మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలిచిన ఓ యువకుడి వీడియోను హైదరాబాద్‌ సీపీ సజ్జనార్ తాజాగా నెట్టింట పంచుకున్నారు. ఇలాంటి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు (Hyd CP Sajjanar).

వీడియోలో (Viral Video) కనిపించిన దాని ప్రకారం, రైలు వచ్చే ముందు ఓ యువకుడు పట్టాలపై నిలబడ్డాడు. సరిగ్గా రైలు వస్తోందనగా అతడు పట్టాల మధ్యలో బోర్లా పడుకున్నాడు. రైలు తనకు తగలకుండా కింద పడుకుని అత్యంత ప్రమాదకరంగా స్టంట్ చేశాడు. అదృష్టవశాత్తూ పట్టాల మధ్య ఉన్న అతడికి తగలకుండానే రైలు పైనుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత మెల్లగా లేచిన అతడు ఏదో ఘనకార్యం చేసినట్టు చేతులను పైకి లేపి గట్టిగా అరిచాడు. ఇక అక్కడే ఉన్న అతడి స్నేహితులూ అరుపులు, కేకలతో యువకుడిని ప్రోత్సహించారు.


ఈ వీడియోను షేర్ చేసిన సీపీ సజ్జనార్ వైరల్‌ మోజులో పడి కొట్టుకుపోతున్న యువత.. ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని హెచ్చరించారు. వైరల్ పిచ్చితో ఇలాంటి పనులు చేయడం సాహసం అనిపించుకోదని హితవు పలికారు. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట అని తేల్చి చెప్పారు. ఒక్క సెకెను తేడా జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఇక వీడియోపై నెటిజన్లు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. కట్టుతప్పుతున్న యువతకు చట్టప్రకారం గట్టిగా బుద్ధి చెబితే ఇలాంటి ఉదంతాలకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడ్డారు.


ఇవీ చదవండి:

యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల పసిడి..

డెలివరీ ఏజెంట్ కష్టాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

Updated Date - Feb 03 , 2026 | 04:48 PM