ఇదేం తెలివి.. హ్యాండ్‌పంప్ నుంచి నీళ్లకు బదులు మద్యం..
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:41 PM
నీళ్ల కోసం హ్యాండ్‌పంప్ కొడితే మద్యం వస్తే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్నా నిజానికి అదే జరిగింది. ఓ ఇంటి ఆవరణలో హ్యాండ్‌పంప్ నుంచి నీళ్లకు బదులుగా మద్యం రావడంతో పోలీసులే అవాక్కయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 23: నీళ్ల కోసం హ్యాండ్‌పంప్ కొడితే మద్యం వస్తే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్నా నిజానికి అదే జరిగింది. ఓ ఇంటి ఆవరణలో హ్యాండ్‌పంప్ నుంచి నీళ్లకు బదులుగా మద్యం రావడంతో పోలీసులే అవాక్కయ్యారు. అనుమానంతో హ్యాండ్‌పంప్‌ను పరిశీలించగా.. నేలమాళిగలో దాచిన అక్రమ మద్యం బయటపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా సకరార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సకరార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం పోలీసులకు సవాల్‌గా మారింది. మద్యం తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టినా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వేళ తేజ్పురా ఘురాట్ గ్రామంలో మద్యం తయారీ, విక్రయాలపై సమాచారం అందింది. దీంతో నవంబర్ 21న పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా ఓ ఇంటిపై దాడి చేశారు. మొదట్లో వారికి ఎంత వెతికినా ఇంట్లో ఎక్కడా మద్యం కనిపించలేదు. దీంతో పరిసరాలను వెతకడం ప్రారంభించారు. అయితే, ఓ పోలీసు అధికారికి అక్కడే ఉన్న హ్యాండ్పంప్పై అనుమానం వచ్చింది. వెంటనే దాని దగ్గరికి వెళ్లి పరిశీలించారు.
హ్యాండ్‌పంప్‌ను కొట్టగా.. నీళ్లకు బదులుగా మద్యం బయటకు రావడంతో పోలీసులు షాక్ అయ్యారు. అప్రమత్తమైన పోలీసులు హ్యాండ్‌పంప్ అడుగు భాగాన్ని పరిశీలించగా నేల కింద మద్యం నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసిన ట్యాంక్ బయటపడింది. ఆ ట్యాంక్‌లో నిల్వ ఉంచిన మద్యాన్ని హ్యాండ్‌పంప్ ద్వారా బయటకు తీసుకునేలా నిందితులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ తనిఖీల్లో సుమారు 30 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మద్యం తయారీకి ఉపయోగించే సుమారు వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓ మహిళను అరెస్టు చేశారు. ఈ అక్రమ మద్యం తయారీ, విక్రయాల వెనుక మరెవరైనా ఉన్నారా? కుటుంబ సభ్యుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, మద్యం విక్రయానికి నిందితులు చేసిన ఏర్పాట్లు చూసి పోలీసులే షాక్ అవ్వడం చర్చనీయాంశమైంది.
ఈ వార్తలు కూడా చదవండి
కేరళం మహిళకు లాటరీలో రూ.46 కోట్లు
వింత పోటీ.. చైనా గూఢచారిణిలా కనిపిస్తే ప్రైజ్ మనీ