నగల దుకాణంలో తుపాకులతో చొరపడిన దొంగలు.. చివరికి..
ABN , Publish Date - May 16 , 2026 | 09:11 PM
మహారాష్ట్ర నాసిక్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. నగల దుకాణంలోకి ప్రవేశించి తుపాకులతో రెచ్చిపోయారు. బంగారం దోచుకునేందుకు విఫలయత్నం చేశారు. షాపు సిబ్బిందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
మహారాష్ట్ర: నాసిక్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. నగల దుకాణంలోకి ప్రవేశించి తుపాకులతో రెచ్చిపోయారు. బంగారం దోచుకునేందుకు విఫలయత్నం చేశారు. షాపు సిబ్బిందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చివరికి వారు ఊహించని విధంగా తిరగపడడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
నాసిక్‌లోని హిరావాడి ప్రాంతంలో న్యూ సమృద్ధి జ్యువెలర్స్ దుకాణం ఉంది. అయితే ఈనెల 14వ తేదీ రాత్రి 9 గంటలకు నలుగురు దుండగులు షాపులోకి ప్రవేశించారు. ముఖానికి మాస్కులు, తలకి టోపీలు పెట్టుకున్నారు. మరో నిందితుడు తలకు హెల్మెట్ ధరించి వచ్చాడు. ఆ సమయంలో దుకాణంలో ముగ్గురు సిబ్బంది (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) మాత్రమే ఉన్నారు. అయితే, దొంగలు వచ్చిన వెంటనే ఓ మహిళా ఉద్యోగిని తలకు తుపాకీ గురి పెట్టాడు.
వెంటనే కంగారు పడిన సదరు మహిళ టేబుల్ కిందికి దూరి దాక్కునే ప్రయత్నం చేసింది. మరో మహిళా ఉద్యోగిని గట్టిగా అరుస్తూ వారిని నిలువరించే ప్రయత్నం చేసింది. ఇంతలో పురుష ఉద్యోగి తేరుకుని వారిని తీవ్రంగా ప్రతిఘటించాడు. దీంతో అతనిపై దుండగులు పిడిగుద్దులు కురిపిస్తూ తలపై తుపాలకు తీవ్రంగా కొట్టారు. అయినా, మహిళ ఉద్యోగి, అతను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారిని గట్టిగా ఎదుర్కొన్నారు. షాపు నుంచి తరిమేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దుండగుల వద్ద తుపాకులు ఉన్నా వీరోచితంగా పోరాడి చివరికి దొంగలను షాపు నుంచి తరిమేశారు.
దీనికి సంబంధించిన దృశ్యాలు షాపు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఉద్యోగులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
వామ్మో.. భార్యతో ఇలాంటి జోకులా.. నెట్టింట వీడియో వైరల్
పుష్ప బాధ్యత నాది... ఫాల్టా రీపోలింగ్ వేళ సీఎం సువేందు వార్నింగ్