వామ్మో.. ఇలాంటి జీవులూ నిద్రపోతాయా!
ABN , Publish Date - Feb 11 , 2026 | 10:20 PM
జెల్లీ ఫిష్‌లూ నిద్రపోతాయని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. వీటిని మరింత లోతుగా అధ్యయనం చేసి నిద్ర గురించిన రహస్యాలను తెలుసుకోవచ్చని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నిద్ర.. దీని గురించి దాదాపు అందరికీ తెలిసిందే. జంతువులన్నీ నిద్రపోతాయి. కానీ, ఈ స్థితి ఒక్కో జంతుజాతిలో ఒక్కోరకంగా ఉంటుంది. నిద్ర వల్ల కలిగే ఉపయోగాల గురించి శాస్త్రవేత్తలకు తెలిసినా దీని పుట్టుక గురించి మాత్రం పూర్తి వివరాలు తెలియవు. పరిణామక్రమంలో జంతువులు నిద్రను ఎలా అలవాటు చేసుకున్నాయేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఈ చిక్కుముడిని విప్పే దిశగా శాస్త్రవేత్తలకు తాజాగా ఓ కీలక ఆధారం లభించింది (Jelly Fish Sleep).
మెదడు అనేదే లేని జెల్లీ ఫిష్‌లు (సముద్రపు జీవులు) నిద్రించడాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. రాత్రి వేళ నిద్ర సమయంలో వీటిల్లో కదలికలు తగ్గిపోవడం, స్పందనలు తగ్గడం వంటి మార్పులను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవన్నీ నిద్రస్థితి లక్షణలే. జీవుల పరిణామ క్రమం తొలి నాళ్లల్లో ఉద్భవించిన జీవుల్లో జెల్లీ ఫిష్‌లు కూడా ఒకటి. వీటి శరీర నిర్మాణం చాలా సరళంగా ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా ఉంటుంది. ఇంతటి అల్పమైన శరీర నిర్మాణం కలిగిన జీవులు కూడా నిద్ర స్థితిని అనుభవిస్తున్నాయంటే.. ఇది జీవపరిణామ క్రమం తొలి నాళ్లల్లో ఉద్భవించిన లక్షణం అయి ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జెల్లీ ఫిష్‌లను మరింత అధ్యయనం చేస్తే నిద్ర పుట్టుపూర్వోత్తరాల గురించి లోతైన అవగాహన కలుగుతుందని అంటున్నారు.
ప్రస్తుతం ఉన్న సిద్ధంతాల ప్రకారం, అనవసరమైన సందర్భాల్లో శక్తి వినియోగాన్ని తగ్గించేందుకు జంతువులు నిద్రపోతుంటాయి. ఉదాహరణకు రాత్రి వేళ వేటాడే జీవులు పగటి వేళ నిద్రపోతే, పగటి వేళ వేటాడే జంతువులు రాత్రి వేళల్లో నిద్రిస్తుంటాయి. తద్వారా ఒంట్లో శక్తిని పొదుపు చేసుకుంటాయి. దెబ్బతిన్న జన్యువులను మరమ్మతు చేసుకునేందుకు ఒక సాధనంగా జంతువులకు నిద్ర ఉపయోగపడుతుందని కూడా నిపుణులు చెబుతారు.
ఇవీ చదవండి:
అప్పటి వరకూ పాడేదే లేదు.. స్టేజ్‌పై ప్రముఖ గాయని అల్టిమేటమ్
ఏంటీ..!? ఎయిర్‌పోర్టులో టీ రూ.10, సమోసా రూ.20.. జనాలు షాక్