కలుపు మొక్కలు తినేందుకు మేకలకు ఉద్యోగం.. జపాన్‌లో వినూత్న ప్రయోగం! వీడియో వైరల్
ABN , Publish Date - Oct 24 , 2026 | 06:26 PM
గడ్డిని కోసే యంత్రాలకు బదులుగా రెండు మేకలకు ఉద్యోగం ఇచ్చింది జపాన్‌లోని ఓ రైల్వే స్టేషన్. వాటి పని కలుపు మొక్కలను తినడమే! ఈ వినూత్న ఆలోచన ఇప్పుడు ప్రయాణికులను ఆకర్షిస్తూ, సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కలుపు మొక్కలను తొలగించేందుకు సాధారణంగా గడ్డి కోసే యంత్రాలను ఉపయోగిస్తారు. కానీ జపాన్‌లోని టోక్యోలో ఓ రైల్వే స్టేషన్ ఇందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. యంత్రాలకు బదులుగా రెండు మేకలను రంగంలోకి దించింది. యోత్సుయా రైల్వే స్టేషన్‌లో పెరిగిపోయిన కలుపు మొక్కలను తినేందుకు నాగి, పోక్కే అనే రెండు మేకలను నియమించింది. అక్టోబర్ ప్రారంభంలో చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం ప్రయాణికులను, అటుగా వెళ్లేవారిని ఆకర్షిస్తోంది. మేకలు గడ్డిని మేస్తుండటాన్ని చూసేందుకు చాలామంది ఆగి ఫొటోలు తీసుకుంటున్నారు. దీంతో స్టేషన్ పరిసరాల్లో ఈ రెండు మేకలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
స్టేషన్ సిబ్బంది ప్రతిపాదన మేరకు ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ (జేఆర్ ఈస్ట్) ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. కలుపు మొక్కలను సహజ పద్ధతిలో నియంత్రించడంతో పాటు గడ్డి కోసే యంత్రాల వినియోగానికి ప్రత్యామ్నాయాన్ని అన్వేషించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. నాగి, పోక్కే మేకలు డిసెంబర్ వరకు స్టేషన్‌లో ఉండనున్నాయి. అయితే.. లక్ష్యంగా పెట్టుకున్న కలుపు మొక్కలను పూర్తిగా తినేస్తే వాటి పని అంతకుముందే ముగియవచ్చు. మేకల సంరక్షణ బాధ్యతను కూడా స్టేషన్ సిబ్బంది చూసుకుంటున్నారు. సాధారణ నిర్వహణ పనిని వినూత్న ప్రయోగంగా మార్చిన ఈ ఆలోచన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇవి కూడా చదవండి..
బొత్స చైతన్యపై జనసేన ఫిర్యాదు.. జెడ్పీటీసీ నామినేషన్‌పై అభ్యంతరం
స్థానిక ఎన్నికలను ఆపేందుకు 59 పిటిషన్లు.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
Read Latest AP News And Telugu News