నర్మదా-క్షిప్రా పైప్‌లైన్ లీక్ కావడంతో భారీ విధ్వంసం..
ABN , Publish Date - Jun 01 , 2026 | 07:43 AM
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్-ఖండ్వా రహదారిపై భేరుఘాట్ సమీపంలో ఆదివారం నాడు వాటర్ పైప్‌లైన్ పగిలిపోవడం విధ్వంసానికి దారి తీసింది. మౌలో నర్మదా-క్షిప్రా పైప్‌లైన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పగిలిపోయింది. సుమారు 150 అడుగుల ఎత్తుకు నీటి ధార ఆకాశంలోకి ఎగజిమ్మింది.
మధ్యప్రదేశ్: ఇండోర్-ఖండ్వా రహదారిపై భేరుఘాట్ సమీపంలో ఆదివారం నాడు వాటర్ పైప్‌లైన్ పగిలిపోవడం విధ్వంసానికి దారి తీసింది. మౌలో నర్మదా-క్షిప్రా పైప్‌లైన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పగిలిపోయింది. సుమారు 150 అడుగుల ఎత్తుకు నీటి ధార ఆకాశంలోకి ఎగజిమ్మింది. దీంతో నిమిషాల వ్యవధిలోనే పెద్దఎత్తున నీరు స్థానిక నివాసాల్లోకి ప్రవేశించింది. ఇళ్లలోని సామగ్రి పూర్తిగా తడిచిపోగా, మరికొన్ని వస్తువులు కొట్టుకుపోయాయి.
అటవీ శాఖ నర్సరీలో పని చేస్తున్న వాచ్‌మన్ ఇల్లు, బాబా ధాబాకు చెందిన రేకుల షెడ్డు బలమైన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. నీటి ఉధృతి ఎలా ఉందంటే.. వర్షాకాలంలో భారీ వరదలు సంభవించిన పరిస్థితి కనిపించింది. పైప్‌లైన్ నుంచి పెద్దఎత్తున నీరు బయటకు రావడంతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. పదుల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సుమారు గంటపాటు సాగిన ఈ విధ్వంసం తర్వాత అధికారులు పైప్‌లైన్‌కు నీటిని ఆపేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా, ఓంకారేశ్వర్ నుంచి ఉజ్జయిని వరకు సాగే నర్మదా-క్షిప్రా ప్రాజెక్ట్‌లో ఈ పైప్‌లైన్ భాగమని స్థానికులు తెలిపారు.
కొన్ని రోజులుగా పైప్‌లైన్ లీక్ అవుతోందని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అయినా నిర్లక్ష్యం వహించి మరమ్మతుల విషయంలో జాప్యం చేశారని ఆరోపించారు. తమ ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఇంతటి ప్రమాదం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరపాలని, నష్టపోయిన తమకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భారీ నీటి ధార, వరదకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి
మనకు పౌర స్పృహ పెరగాలి: పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా
జపాన్‌లో భారతీయ మహిళ చోరీ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాక..