Share News

జపాన్‌లో భారతీయ మహిళ చోరీ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాక..

ABN , Publish Date - May 31 , 2026 | 10:23 PM

జపాన్‌ షాపులో చోరీ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఒక మహిళ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

జపాన్‌లో భారతీయ మహిళ చోరీ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాక..

ఇంటర్నెట్ డెస్క్: జపాన్ పర్యటన సందర్భంగా ఒక భారతీయ మహిళ చోరీకి పాల్పడి ఎలా అడ్డంగా బుక్కైపోయిందీ చెబుతూ ఆమె తోటి ప్రయాణికుడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ముత్తుకృష్ణన్ దండపాణి అనే ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ఈ పోస్టును షేర్ చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాక ఆమె చేసిన పని అక్కడి అధికారులకు మరింత కోపం తెప్పించిందని అన్నారు.

తమ వెంట ఉన్న మహిళ ఒక గిఫ్ట్ షాపులో చోరీ చేసి దొరికిపోయిందని చెప్పారు. మొదటి నుంచీ ఇలా చేస్తున్నా తమకు తెలియలేదని అన్నారు. అయితే, షాపు ఓనర్‌కు దొరికిపోయాక ఆమె డబ్బు ఆఫర్ చేసి బయటపడే ప్రయత్నం చేసిందని అన్నారు. కానీ షాపు యజమాని ఒప్పుకోలేదని చెప్పారు. జపాన్‌లో ప్రజలు విశ్వసనీయత, నిజాయతీలకు పెద్ద పీట వేస్తారని షాపు యజమాని చెప్పారని అన్నారు. కాబట్టి, ఆయన ఆమె ఇచ్చిన డబ్బు తీసుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు.


చివరకు ఆమె వెంట తమ టూర్ మేనేజర్ స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. అక్కడ కూడా ఆమె డబ్బు ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసిందని చెప్పారు. దీంతో, ఆమె తీరు పోలీసులకు కూడా కోపం తెప్పించిందని అన్నారు. జపాన్‌లో షాపుల్లో చోరీలు ఎంత పెద్ద నేరమో అధికారులు ఆమెకు చెప్పారని తెలిపారు. ఇలాంటి తప్పులు చేసేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి చివరకు హెచ్చరికతో వదిలిపెట్టారని అన్నారు.

ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇలాంటి పర్యాటకుల వల్ల యావత్ దేశానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరేమో ఆ షాపు యజమాని ప్రదర్శించిన నిజాయతీని మెచ్చుకున్నారు. ఇచ్చిన డబ్బు తీసుకుని మ్యాటర్ సెటిల్ చేయకుండా బాధ్యతగా పోలీసులకు ఫిర్యాదు చేయడం నిజంగా గొప్ప విషయమని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Updated Date - May 31 , 2026 | 10:38 PM