విమానంలో స్టీల్ ప్లేట్‌లో వృద్ధ దంపతుల భోజనం.. నెటిజన్ల మధ్య హాట్ డిబేట్..
ABN , Publish Date - Aug 31 , 2026 | 03:04 PM
విమానంలో ఓ వృద్ధ దంపతులు ఇంటి భోజనం తినడం సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారితీసింది. సాధారణంగా ఇంట్లో కనిపించే సీన్.. ఏకంగా ఇండిగో విమానంలో కనిపించడంతో వీడియో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ: విమానంలో ఓ వృద్ధ దంపతులు ఇంటి భోజనం తినడం సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారితీసింది. సాధారణంగా ఇంట్లో కనిపించే సీన్.. ఏకంగా ఇండిగో విమానంలో కనిపించడంతో వీడియో వైరల్‌గా మారింది. స్టీల్ ప్లేట్‌లో పరోటాలు, పెరుగు, పచ్చడితో ఆ దంపతులు ప్రశాంతంగా భోజనం చేస్తుండటం చూసి తోటి ప్రయాణికులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
ఇండిగో విమానంలో ఓ వృద్ధ దంపతులు ప్రయాణిస్తున్నారు. అందరూ తమ సీట్లలో కూర్చొని ఉండగా.. ఆ వృద్ధ మహిళ తన వెంట తెచ్చుకున్న ఆహారాన్ని బయటకు తీసింది. ముందుగా పరోటాలను స్టీల్ ప్లేట్‌లో ముక్కలుగా చేసి పెట్టింది. వాటి పక్కనే పచ్చడినీ వేసింది. అనంతరం పెరుగు ప్యాకెట్‌ను తెరిచి ప్లేట్‌లో కొంచెం వేసింది. ఇందుకు ఆమె పక్కనే కూర్చున్న వృద్ధుడూ సహాయం చేశాడు. అంతా సిద్ధమైన తర్వాత ఇద్దరూ ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా భోజనం చేయడం ప్రారంభించారు. మహిళ పరోటాను పెరుగులో ముంచుకుని తింటుండగా.. పక్కనే ఉన్న వృద్ధుడు తన భోజనం తింటూ కనిపించాడు. దంపతులు ఇంటి భోజనం చేస్తున్నా క్యాబిన్ క్రూ వారిని ఆపకపోవడం నెటిజన్లను ఆకర్షించింది.
ఈ ఘటనను వీడియో తీసిన ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యింది. దీంతో విమానంలో బయటి ఆహారం తినొచ్చా?, లేదా? అన్న అంశంపై నెట్టింట చర్చ మొదలైంది. ‘విమానంలో దొరికే ఆహారం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. వందల రూపాయలు ఖర్చు చేసి శాండ్విచ్ కొనడం అందరికీ సాధ్యం కాదు’ అని కొందరు వారిని సమర్థించారు. విమాన ప్రయాణంలో కొన్ని నియమ, నిబంధనలు ఉంటాయని, వాటిని పాటించాలని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలా భిన్నాభిప్రాయాల మధ్య వీడియో వైరల్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
చెల్లిని భుజాన ఎత్తుకుని తల్లిదండ్రుల కోసం వెతుకులాట.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో
నేపాల్ వరదలకు కారణం ఇదే.. వైరల్‌గా మారిన డ్రోన్ విజువల్స్..