అమెరికాలో ఏడాదికి కోటి జీతం.. అయినా ఆర్థిక కష్టాలే అంటున్న భారతీయ మహిళ!
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:24 PM
అమెరికాలో ఉద్యోగం.. ఏడాదికి దాదాపు కోటి రూపాయల జీతం.. అయినా నెలాఖరుకు చేతిలో మిగిలేది లక్ష రూపాయల లోపే! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే తన పరిస్థితి అంటోంది అమెరికాలో ఉంటున్న ఓ భారతీయ మహిళ. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో నివసిస్తున్న భారతీయ మహిళ మహిమా రాఠీ తన నెలవారీ ఆదాయం.. ఖర్చుల వివరాలను వెల్లడించింది. ఆమె సోదరుడు నితిన్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మహిమ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ప్రతి నెలా సుమారు 8,000 డాలర్లు (రూ.7.5 లక్షలు) సంపాదిస్తోంది. అయితే.. ఇందులో 1,500 డాలర్లు (రూ.1.4 లక్షలు) పన్నులకే చెల్లిస్తోంది. ఇంటి గృహ రుణం కోసం 2,500 డాలర్లు (రూ.2.34 లక్షలు), ఆహారం కోసం 1,000 డాలర్లు (రూ.94 వేలు) ఖర్చు చేస్తోంది. వైద్య బీమాకు 500 డాలర్లు, కారు బీమా, ఇంధనానికి మరో 500 డాలర్లు వెచ్చిస్తోంది. ఫోన్, ఇంటర్నెట్, ఇతర ఇంటి బిల్లులకు 500 డాలర్లు, పిల్లల అవసరాలకు 300 డాలర్లు, ఇతర ఖర్చులకు 200 డాలర్లు ఖర్చవుతున్నాయని వివరించింది.
ఈ ఖర్చులన్నీ పోను నెలకు సుమారు 1,000 డాలర్లు (రూ.94 వేలు) మాత్రమే మిగులుతున్నాయని మహిమ తెలిపింది. ఇందులో వ్యక్తిగత ఖర్చులు కూడా లెక్కలోకి తీసుకోలేదని పేర్కొంది. గతంలో భారత్లో ఉన్నప్పుడు ఏడాదికి రూ.15 లక్షలు సంపాదించినప్పటికీ.. అప్పట్లో ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయగలిగానని వెల్లడించింది. అమెరికాలో మెరుగైన జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం వంటి సౌకర్యాలు ఉన్నాయని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భారీ జీతాలు వచ్చినా అధిక జీవన వ్యయం కారణంగా పొదుపు చేయడం కష్టమవుతోందని మరికొందరు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. దీంతో అమెరికాలో అధిక ఆదాయం ఉన్నంత మాత్రాన ఆర్థికంగా సౌకర్యవంతమైన జీవితం ఉంటుందా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏపీ లిక్కర్ కేసు.. తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్
ఏపీ పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తాం