Share News

అఫ్గానిస్థాన్‌లో ఒంటరిగా భారత మహిళ టూర్.. వీడియో వైరల్

ABN , Publish Date - Jun 16 , 2026 | 10:16 AM

అఫ్గానిస్థాన్‌లో ఒంటరిగా పర్యటిస్తున్న ఒక భారతీయ మహిళ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అక్కడి పరిస్థితులపై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు జనాలను ఆకట్టుకుంటున్నాయి.

అఫ్గానిస్థాన్‌లో ఒంటరిగా భారత మహిళ టూర్.. వీడియో వైరల్
Indian Woman Afghan Tour

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌లో ఒంటరిగా పర్యటిస్తున్న ఒక భారతీయ మహిళ వీడియో వైరల్‌గా మారింది. తన తల్లిదండ్రులకు చెప్పకుండా అక్కడకు వెళ్లినట్టు ఆమె చెప్పారు. తాను క్షేమంగానే ఉన్నానని అన్నారు. అయితే, అక్కడి పరిస్థితులు మాత్రం నమ్మశక్యం కానట్టు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అన్నారు.

ఈ టూర్ సందర్భంగా అఫ్గానీ మహిళలతో ఆమె ఫొటో దిగారు. తుపాకీలు చేతబట్టుకుని వీధుల్లో సంచరిస్తున్న జనాలను చూసి ఆశ్చర్యపోయారు. అక్కడి వారి ఆప్యాయత, ఆతిథ్యం, స్నేహశీలత వంటివి చూసి మురిసిపోయారు. మహిళలు ఎదుర్కొంటున్న అణచివేతను చూసి చలించిపోయారు. అక్కడి మహిళల చిక్కులు ఇతర దేశాల్లోని వారు కనీసం ఊహించలేరని కూడా చెప్పారు. ఇంతటి అణచివేతను తట్టుకుని ముందుకు సాగుతున్న వారి ధైర్యం తనను మంత్రముగ్ధురాలిని చేసిందని అన్నారు. ప్రజల జీవనంలోని రెండు పరస్పర విరుద్ధమైన కోణాలు తనను మాటల్లో చెప్పలేనంతగా ఆశ్చర్యపరిచాయని చెప్పారు.


అక్కడి ప్రజల్లో సహృదయతతో పాటు దశాబ్దాల పాటు సాగిన యుద్ధాల తాలూకు విషాదం కొట్టొచ్చినట్టు కనిపించిందని అన్నారు. అక్కడి భవనాలు కూడా దశాబ్దాలుగా సాగుతున్న అస్థిరతకు మౌన సాక్షులుగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులపై తనకు కొంత అవగాహన ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు రకరకాల భావోద్వేగాలు తనను ముంచెత్తాయని చెప్పారు. ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ అక్కడి వారి స్నేహశీలతను మాత్రం ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు. తాను క్షేమంగా ఉన్నానని మరోసారి చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ఈ వార్తలనూ చదవండి:

జపాన్ జనాల పద్ధతే వేరు.. ప్రపంచం ఫిదా

ఒక బాయ్‌ఫ్రెండ్‌గా నాకు కొన్ని బాధ్యతలు తప్పవు.. జస్టిన్ ట్రూడో

Updated Date - Jun 16 , 2026 | 10:30 AM