Share News

హంగు ముడి!

ABN , Publish Date - Nov 14 , 2026 | 05:46 AM

పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. ఇవి మాత్రమే కాదు.

హంగు ముడి!
marrige

పెళ్లికి అప్పులు చేస్తున్న వధూవరులు.. సగటున రూ.15.5 లక్షల అప్పు

  • ఏళ్ల తరబడి ఈఎంఐలతో కుస్తీలు

  • పెళ్లికి సామాన్య కుటుంబం

  • పెట్టే సగటు ఖర్చు 40 లక్షల రూపాయలు

  • ఫంక్షన్‌ హాల్‌, నగలు, భోజనాలకే ఎక్కువ

  • ఏటా పెరుగుతున్న పెళ్లిళ్ల సగటు బడ్జెట్‌

  • ‘వెడ్‌ మీ గుడ్‌’ సంస్థ సర్వేలో వెల్లడి

ముంబై, నవంబరు 13: పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. ఇవి మాత్రమే కాదు. హంగు, ఆర్భాటం కూడా! ఆస్తులు కుదువ పెట్టో, కొంత అమ్ముకునో, అప్పులు చేసో.. ఆడబిడ్డ పెళ్లిని వైభవోపేతంగా చేస్తుంటారు. ఇందుకు సగటు మధ్య తరగతి, ఎగువ తరగతి ‘తండ్రి’ ఖర్చు పెట్టేదెంతో తెలుసా.. అక్షరాలా రూ.39.50 లక్షలు. అవును.. ఈ రోజుల్లో పెళ్లి వేడుక అనేది అత్యంత ఖరీదైన వ్యవహారంగా.. రానురాను అప్పులకుప్పగా మారుతోంది. పెళ్లికి కన్నవారే కాకుండా.. వివాహం చేసుకోబోయే జంట కూడా వెనకాముందు ఆలోచించకుండా డబ్బు ఖర్చు పెట్టడం ట్రెండ్‌గా మారింది. ఇందుకోసం ఆ జంట కూడా అప్పులు చేస్తోంది. పెళ్లి తరువాత ఆ అప్పు తీర్చేందుకు ఈఎంఐలు కడుతోంది. ఇదంతా ‘వెడ్‌ మీ గుడ్‌’ అనే వెడ్డింగ్‌ ప్లానింగ్‌ సంస్థ సర్వే నివేదిక చెబుతున్న విషయం. ఈ సంస్థ పలు నగరాల్లోని 2వేల జంటలను సర్వే చేసి.. ఈ గణాంకాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. నేటి పెళ్లిళ్లకు సగటు బడ్జెట్‌ రూ.39.5 లక్షలు అవుతోంది. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకైతే ఈ సగటు ఖర్చు మరింత పెరిగి రూ.58 లక్షలు అవుతోంది. ప్రధానంగా ఫంక్షన్‌ హాళ్లు, అలంకరణ, ఆభరణాలు, భోజనాలకే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు. పెళ్లిని ఘనంగా చేసుకోవాలనుకున్న జంటలు స్వయంగా వారు కూడా అప్పు చేస్తున్నారు.


ఇలా పెళ్లి కోసం ప్రతి కొత్త జంట సగటున రూ.15.5 లక్షల అప్పు చేస్తోంది. అయితే ఇలా అప్పు చేస్తున్న జంటలు కేవలం 15 శాతం మాత్రమేనని, 79 శాతం దాకా జంటలు తాము పొదుపు చేసుకున్న సొమ్ముతోనే వివాహం చేసుకుంటున్నాయని, 6.25 శాతం జంటలు మాత్రం తమ ఆస్తులను అమ్మి వివాహ ఖర్చులు భరిస్తున్నాయని సర్వే నివేదిక పేర్కొంది. మొత్తంగా దేశంలో ఏటా 40 లక్షల నుంచి 50 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నాయని, ఇందుకోసం ఏటా సుమారు రూ.6.5 లక్షల కోట్లు ఖర్చవుతున్నాయని అంచనా వేసింది. ఈ ఖర్చు ఏటా 8 శాతం పెరిగిపోతోందని తెలిపింది.

హైదరాబాద్‌లో రూ.37 లక్షలు..

వివాహానికి అయ్యే ఖర్చు దేశంలో అన్ని చోట్లా ఒకేలా లేదు. నగరాల వారీగా చూస్తే ఈ సగటు ఖర్చులో తేడాలున్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో పెళ్లికి అయ్యే సగటు ఖర్చు రూ.37 లక్షలు అవుతుండగా, జైపూర్‌లో అత్యధికంగా రూ.73 లక్షలు అవుతోందని సర్వే నివేదిక పేర్కొంది. ఢిల్లీలోనైతే రూ.38 లక్షలు


దంపతులిద్దరూ సంపాదిస్తేనే..

పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చాలంటే దంపతులిద్దరూ సంపాదించే వారైతే ఈఎంఐ చెల్లించడం సులభమే. కానీ, వారిలో ఒకరు ఉద్యోగం కోల్పోవడమో, అత్యవసర వైద్య పరిస్థితి ఎదురవడమో జరిగితే మాత్రం సమస్యలు మొదలవుతున్నాయి. సాధారణంగా బ్యాంకులు వివాహ రుణాలను వ్యక్తిగత రుణాలుగానే ఇస్తాయి. ప్రైవేటు బ్యాంకుల్లో వీటిపై వడ్డీ 9.99శాతం నుంచి 22శాతం వరకు, ప్రభుత్వ బ్యాంకుల్లో 10.3శాతం నుంచి 16.50 శాతం వరకు ఉంటుంది. ఉదాహరణకు రూ.15.5 లక్షల రుణాన్ని 12శాతం వడ్డీకి ఐదేళ్ల కాలపరిమితికి తీసుకుంటే.. నెలకు రూ.34,500 ఈఎంఐ చెల్లించాలి. ఇలా ఐదేళ్లలో వడ్డీ రూపంలోనే రూ.5.2 లక్షలు అదనంగా చెల్లించాల్సివస్తుంది. అయితే దేశంలో కుటుంబాల అప్పులు రికార్డు స్థాయికి చేరాయని ఆర్బీఐ చెబుతోంది. పైగా పెద్ద బ్యాంకుల మొండి బకాయిల్లో ఎక్కువ భాగం తక్కువ ఆదాయ వర్గాలవారు తీసుకున్న రుణాలేనని తెలిపింది. పెళ్లి వంటి ఒక్కరోజు కోసం చేసే భారీ అప్పు.. దీర్ఘకాలంలో కుటుంబ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయకుండా చూసుకోవాలని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు.. రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మ‌ృతి.. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్టు

Updated Date - Nov 14 , 2026 | 05:58 AM