అంతరిక్షంలోకి వజ్రాన్ని పంపించనున్న భారతీయ కంపెనీ!
ABN , Publish Date - Jul 10 , 2026 | 02:38 PM
అంతరిక్షంలోకి వజ్రాన్ని పంపించేందుకు ఒక భారతీయ జువెలరీ కంపెనీ సిద్ధమైంది. ల్యాబ్‌లో సిద్ధం చేసిన ‘కాస్మిక్ బ్లూమ్’ వజ్రాన్ని త్వరలో అంతరిక్షానికి పంపించనున్నామని భారతీయ జువెలరీ సంస్థ కాస్మోస్ డైమండ్స్ సంస్థ తాజాగా తెలిపింది
ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్షంలోకి వజ్రాన్ని పంపించేందుకు ఒక భారతీయ కంపెనీ సిద్ధమైంది. ల్యాబ్‌లో సిద్ధం చేసిన ‘కాస్మిక్ బ్లూమ్’ వజ్రాన్ని త్వరలో అంతరిక్షానికి పంపించనున్నామని భారతీయ జువెలరీ సంస్థ కాస్మోస్ డైమండ్స్ తాజాగా తెలిపింది. స్కైరూట్ ఎయిరోస్పేస్ సంస్థకు చెందిన విక్రమ్-1 మిషన్‌లో భాగంగా ఈ వజ్రం అంతరిక్షానికి వెళ్లనుంది. ల్యాబ్‌లో తయారు చేసిన ఒక వజ్రాన్ని అంతరిక్షంలోకి పంపించడం చరిత్రలో ఇదే తొలిసారని కాస్మోస్ డైమండ్స్ పేర్కొంది.
అంతరిక్షంలోకి ఏ వస్తువును పంపించాలనే అంశంపై నెలల తరబడి చర్చించామని కాస్మోస్ డైమండ్స్ పేర్కొంది. భారత్‌కు ప్రతిబింబంగా ఏది నిలుస్తుందనే విషయంపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపింది. అంతిమంగా కమలం ఆకారంలో ఉన్న వజ్రాన్ని పంపించాలని నిర్ణయించామని వెల్లడించింది. ‘అంతరిక్షంలోకి వజ్రాన్ని పంపించడం మామూలు విషయం కాదు.. చరిత్ర సృష్టిస్తున్నట్టే. ప్రపంచానికి భారత్ తరఫున ఒక సందేశాన్ని పంపిస్తున్నట్టే’ అని సంస్థ పేర్కొంది.
వజ్రం డిజైన్ విషయంపై చాలా అధ్యయనం చేశామని కంపెనీ డిజైనర్లు తెలిపారు. అనేక పురాతన భారతీయ దేవాలయాలను పరిశీలించామని అన్నారు. విష్ణువు, శివుడు, బ్రహ్మ, బుద్ధుడితో పాటు కమలం చిత్రాలను దేవాలయ గోడలపై చెక్కిన విషయాన్ని పేర్కొన్నారు. కమలం స్వచ్ఛతకు, జ్ఞానానికి, సృష్టికి చిహ్నమని అన్నారు. కాబట్టి భారతీయతకు చిహ్నంగా ఉన్న కమలం ఆకారంలో వజ్రాన్ని డిజైన్ చేశామని చెప్పారు.
అంతరిక్ష ప్రయోగానికి అనువుగా వజ్రాన్ని తయారు చేసేందుకు కంపెనీ పలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. వజ్రం నుంచి ఏ భాగం విడిపోకుండా పటిష్ఠంగా నిర్మించింది. ఇక జులై 12 - ఆగస్టు 24 మధ్య సమయం రాకెట్ ప్రయోగానికి అనుకూలమని స్కైరూట్ సంస్థ పేర్కొంది. అయితే, ప్రయోగ తేదీపై తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే శాటిలైట్ ప్రయోగాలకు రాకెట్‌ను అభివృద్ధి చేసిన తొలి భారతీయ ప్రైవేటు సంస్థగా స్కైరూట్ చరిత్రలో నిలిచిపోతుంది.
ఈ వార్తలనూ చదవండి:
నా వంట నేనే చేసుకుంటా.. తిహాడ్ జైల్లోని అమెరికన్ ఖైదీ పిటిషన్
వరద నీటిలో 900 పాములు.. నరకం చూస్తున్న చైనా ప్రజలు..