Share News

దురంధర్ మూవీ సన్నివేశాలతో ప్రొఫెసర్ పాఠాలు.. ఐఐఎమ్‌లో అద్భుత దృశ్యం

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:38 PM

దురంధర మూవీలోని సీన్స్‌ సాయంతో గణితంలోని సంక్లిష్ట అంశాలను బోధించిన ఒక ఐఐఎమ్ ప్రొఫెసర్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.

దురంధర్ మూవీ సన్నివేశాలతో ప్రొఫెసర్ పాఠాలు.. ఐఐఎమ్‌లో అద్భుత దృశ్యం
IIM Professor Viral Video

ఇంటర్నెట్ డెస్క్: సినిమా సన్నివేశాలతో గణాంకశాస్త్రాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించిన ఒక ప్రొఫెసర్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఐఐఎమ్ అహ్మదాబాద్‌లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. జనాలు ఈ వీడియోకు బ్రహ్మరథం పడుతున్నారు.

ఐఐఎమ్‌లో చదువుకుంటున్న ప్రకాశ్ సింగ్ అనే విద్యార్థి ఈ వీడియోను షేర్ చేశారు. ప్రొజెక్టర్ తెరపై దురంధర్ సినిమా సన్నివేశాలను వివరిస్తూ ఆ ప్రొఫెసర్ స్టాటిస్టిక్స్‌లోని (గణాంకశాస్త్రం) క్లస్టర్ శాంప్లింగ్, స్ట్రాటిఫికేషన్ అనే అంశాలను వివరించారు. ల్యారీ ప్రాంతం ఎన్నికల్లో గెలిచిన వారు యావత్ పాకిస్థాన్‌లో గెలవొచ్చన్న డైలాగ్‌లో క్లస్టర్ శాంప్లింగ్ సూత్రం దాగుందని ప్రొఫెసర్ చెప్పారు.


మూవీలోని బలోచ్ గ్యాంగ్, పఠాన్ గ్యాంగ్‌ల మధ్య వ్యత్యాసాల ద్వారా స్ట్రాటిఫికేషన్ సూత్రాన్ని వివరించారు. ప్రాథమిక అంశాలను ఇలా సులభంగా వివరించాక మరింత లోతైన అంశాలను ప్రొఫెసర్ బోధించారని ప్రకాశ్ సింగ్ చెప్పారు. గణాంకశాస్త్రంలోని రకరకాల శాంప్లింగ్ పద్ధతులను వాస్తవ ప్రపంచంలో ఎలా ఉపయోగించాలో దురంధర్ సినిమా ద్వారా ప్రొఫెసర్ వివరించారని అన్నారు.

ఇక ఈ వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సంక్లిష్ట విషయాలను స్టూడెంట్స్‌కు అర్థమయ్యేలా బోధించేందుకు సృజనాత్మక విధానాలను ఫాలో అవుతున్న ప్రొఫెసర్‌పై అనేక మంది ప్రశంసలు కురిపించారు. ఇలాంటి సీన్స్ ఐఐఎమ్‌లల్లో తప్ప మరెక్కడా చూడలేమని మరికొందరు అన్నారు. విద్యార్థులకు ఇలా బోధిస్తే వారు మరెన్నడూ పాఠాలు మర్చిపోరని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

మూకుమ్మడిగా ఫోన్లు పగులగొట్టిన నేరస్థులు.. కారణమేంటో తెలిస్తే..

అఫ్గానిస్థాన్‌లో ఒంటరిగా భారత మహిళ టూర్.. వీడియో వైరల్

Updated Date - Jun 19 , 2026 | 04:46 PM