Share News

రోబో కుక్కతో వాకింగ్‌కు వెళ్లిన రోబో మనిషి.. వీడియో వైరల్

ABN , Publish Date - Mar 10 , 2026 | 07:53 AM

‘ఐ రోబోట్’ సినిమాలోలాగే నిజ జీవితంలోనూ ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ హ్యూమనాయిడ్ రోబోట్.. రోబో కుక్కతో వాకింగ్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

రోబో కుక్కతో వాకింగ్‌కు వెళ్లిన రోబో మనిషి.. వీడియో వైరల్
humanoid robot viral video

ఇంటర్‌నెట్ డెస్క్: హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ ‌స్మిత్ నటించిన ‘ఐ రోబోట్’ సినిమాలో మనుషులు అన్ని పనుల కోసం రోబోలను ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతీ ఇంట్లో టీవీ ఉన్నట్లు.. ఓ రోబో పని మనిషి కూడా ఉంటుంది. రోబోలు తమ యజమానుల ఇళ్లలో అన్ని పనులు చేస్తుంటాయి. పెంపుడు కుక్కలను వాకింగ్‌కు కూడా తీసుకెళుతుంటాయి. అచ్చం ఈ సినిమాలోలాగే నిజ జీవితంలోనూ ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ హ్యూమనాయిడ్ రోబోట్.. రోబో కుక్కతో వాకింగ్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.


ఆ వీడియోలో చైనాకు చెందిన 4 అడుగుల 3 అంగుళాల పొడవున్న యూనీట్రీ జీ1 హ్యూమనాయిడ్ రోబోట్.. యూనీట్రీ గో2 రోబోట్ కుక్కతో రోడ్డుపై వాకింగ్ చేస్తోంది. కుక్క మెడలో ఉన్న తాడును రోబో మనిషి పట్టుకోగా.. మనిషి పక్కన రోబో కుక్క నడుస్తూ ఉంది. రోడ్డుపై వెళుతున్న జనం ఎంతో ఆసక్తిగా ఆ రోబోలను చూస్తూ ఉన్నారు. కొంతమంది వీడియోలు, ఫోటోలు కూడా తీసుకున్నారు. 23 సెకన్ల ఆ వీడియో పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ తెచ్చుకుంది.


ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘రోబో కుక్కకు ఓ రోబో యజమాని కూడా ఉన్నాడు. ఇది చాలా ఫన్నీగా ఉంది’.. ‘ప్రపంచ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన డాగ్ వాకింగ్. ఎందుకంటే.. ఆ రోబో మనిషి ధర 16 వేల డాలర్లు ఉంటుంది. ఆ కుక్క ధర 2800 డాలర్లు ఉంటుంది’.. ‘చైనా వాళ్లకు టెక్నాలజీ పరంగా ఎవ్వరూ సాటిరారు. ఇందుకు ఈ వీడియోనే ప్రత్యక్ష సాక్ష్యం’.. ‘ఈ వీడియో చూస్తుంటే స్కై ఫై సినిమా చూసినట్లుగా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

వేసవిలో సోంపు నీళ్లు తాగడం మంచిదేనా?

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమోటా

Updated Date - Mar 10 , 2026 | 08:09 AM